పొన్నాల లక్ష్మయ్యా.. ప్రెస్ మీట్ లక్ష్మయ్యా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. పీపీఏలను రద్దు చేయాలనడం ద్వారా చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని ఆయన ఆరోపించారు.
2019లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ మతి భ్రమించి మాట్లాడుతున్నారని చంద్రబాబును వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు సమర్ధిస్తే తమ రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లే అని కోమటిరెడ్డి విమర్శించారు. అలాగే తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అనుసరిస్తున్న వ్యవహార శైలిపై కూడా వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు.
పొన్నాల లక్ష్మయ్య ప్రెస్ మీట్ లక్షయ్యగా మారారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఇతర నేతలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని సీనియర్ నాయకులకు హితవు పలికారు. తెలంగాణ పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.