
పార్టీలు విలీనం కావాలి.. సభ్యులు విలీనం కావడమేమిటి?
హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. పార్టీలు మాత్రమే విలీనం కావాలని.. ఎమ్మెల్సీలు విలీనం ఏమిటని రాఘవరెడ్డి ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రాఘవరెడ్డి.. మండలి ఛైర్మన్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరగాలని, న్యాయ, రాజ్యాంగ నిపుణులు స్పందించాలని ఆయన అన్నారు.
పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించినట్లు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ శాసనమండలి సభ్యులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, మహ్మద్ సలీంలు పార్టీలో విలీనం కావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గుర్తించినట్లు సోమవారం మండలి సమావేశాలు సందర్భంగా ఛైర్మన్ స్వామిగౌడ్ పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగం 10 వ షెడ్యూల్ అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. దీనిపై రాజ్యాంగ నిపుణులు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.