
దొంగ రాజీనామాల సంస్కృతి కాంగ్రెస్‌దే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో దొంగ రాజీనామాలు, దొంగ దీక్షలు చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదేనని, అది వారి సంస్కృతి అని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నా మన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి ఒక్కరోజు కూడా ఉద్యమకారులకు అండగా నిలవలేదని ఆరోపించారు.
ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో విద్యార్థుల ఆత్మహత్య లు పెరిగి, ఉద్యమకారులపై అక్రమ కేసులు, పోలీసు నిర్బంధం పెరిగినప్పుడు కూడా ఆయన స్పందించక పోగా అవహేళన చేయలేదా అని ప్రశ్నించారు. జాతీయవాదిని, దేశ మంత్రిని అని చెప్పుకునే ఆ పెద్ద మనిషికి తెలంగాణను సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.