సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరి శ్రమల స్థాపనను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి జిల్లా చౌటు ప్పల్ మండలం దండు మల్కాపూర్‌లో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) సహకారంతో రాష్ట్ర పారి శ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు’ను పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు నవంబర్ 1న ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా అభివర్ణిస్తున్న దండుమల్కాపూర్ పారిశ్రామికవాడలో తొలి దశలో ఏర్పాటవుతున్న 450 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రెండేళ్ల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించాలనే నిబంధన విధించారు. సుమారు రూ. 1,500 కోట్ల పెట్టుబడి అంచనాతో 35 వేల మందికి ఉపాధి కల్పించే ఈ పారిశ్రామికవాడ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుందని రాష్ట్ర పారి శ్రామికవేత్తల సమాఖ్య వర్గాలు చెబుతు న్నాయి. ప్రస్తుతం 438 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయగా, భవిష్యత్తులో 1,200 ఎకరాల్లో విస్తరిం చేందుకు టీఎస్‌ఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అద్దె స్థలాల్లోనే ఎక్కువ ఎంఎస్‌ఎంఈలు..
రాష్ట్రంలో సుమారు 25 లక్షలకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఉండగా వాటిలో 40 శాతం పరిశ్రమలకే సొంత స్థలాలు ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలోని 142 పారిశ్రామిక వాడల్లో 20 శాతంలోపే ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఫ్ కోరింది. దీంతో దండుమల్కాపూర్‌లో తొలి దశలో 371 ఎకరాలు, రెండో దశలో 67 ఎకరాలు కలుపుకొని మొత్తంగా 438 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఎకరాకు రూ. 14 లక్షల చొప్పున టిఫ్‌కు కేటాయించింది.
ఇందులో పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌తోపాటు పొరుగు జిల్లాల నుంచి 1,200 మంది దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 450 మందికి ప్లాట్లు కేటాయించారు. టిఫ్ సమర్పించిన నివేదికను అనుసరించి పారిశ్రామిక పార్కులో మౌలిక సౌకర్యాల కల్పన ప్రణాళికను రూపొందించారు. ఈ పార్కుకు హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిని అనుసంధా నిస్తూ 2.5 కిలోమీటర్ల పొడవైన అప్రోచ్ రోడ్డుతో పాటు రోడ్లు, మురుగు, వర్షపునీటి కాలువలు, విద్యుత్ తదితర మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేశారు. అప్రోచ్ రోడ్డును 100 అడుగుల వెడల్పు తో నిర్మించారు. బాహ్య మౌలిక సౌకర్యాల కల్పన కు టీఎస్‌ఐఐసీ రూ.35 కోట్లు, అంతర్గత మౌలిక సౌకర్యాలకు టిఫ్ రూ.150 కోట్లు ఖర్చు చేశాయి.
సకల సౌకర్యాలు...
రెడ్ కేటగిరీకి చెందిన కాలుష్యకారక పరిశ్రమలకు పార్కులో అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించడం తోపాటు గ్రీన్ కేటగిరీ పరిశ్రమలనే ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం మురుగు నీటి, వాననీటి కాలువలు, సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. భగీరథ ద్వారా పార్కుకు నీటి సరఫరాకు ప్రత్యేక పైపులైన్లు నిర్మించారు. భవిష్యత్తులో ఉమ్మడి సౌకర్యాల కేంద్రం, పోలీసు స్టేషన్, అగ్నిమాపక కేంద్రం, ట్రక్ టర్మినల్, బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసు ఏర్పాటు చేయనున్నారు. ‘మల్టీ ప్రోడక్ట్’ మార్కెటింగ్ మెళకువలపై పారిశ్రామికవేత్తలకు శిక్షణ, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు.
పార్కులోనే టౌన్‌షిప్‌లు...
‘వాక్ టు వర్క్ ప్లేస్’ నినాదంతో పారిశ్రామిక పార్కులో సమీకృత జనావాసాలు (ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు) నిర్మించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం టీఎస్‌ఐ పాస్‌తోపాటు కొత్త మున్సిపల్ చట్టం నిబంధనల మేరకు పారిశ్రామికవాడల్లోనే టౌన్‌షిప్‌లు నిర్మించే యోచనకు దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ గ్రీన్ పార్కులో శ్రీకారం చుడుతున్నారు. దండుమల్కా పూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును 1,242.36 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని టీఎస్‌ఐఐసీ ప్రతిపా దించగా ఇప్పటివరకు 1,087 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 155 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని మరో 700 ఎకరాల భూసేకరణకు అనుమతివ్వాలని టీఎస్‌ఐఐసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. భూసేక రణ ప్రక్రియ పూర్తయ్యాక గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును దశలవారీగా అభివృద్ధి చేసేందుకు టీఎస్‌ఐఐసీ ప్రణాళికలు రచిస్తోంది.
పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలు..
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, వైమానిక రంగం, ఆహార శుద్ధి, డ్రిల్లింగ్, రక్షణ రంగం.
కాలుష్యరహిత పరిశ్రమలకే చోటు..
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో కాలుష్య రహిత పరిశ్రమలకే అనుమతి ఇస్తాం. పార్కులో పరిశ్రమల స్థాపనకు అనేక మంది ముందుకు వస్తుండటంతో ప్లాట్ల కోసం పోటీ ఏర్పడింది. దీంతో 2 వేల ఎకరాల భూసేకరణ దిశగా టీఎస్‌ఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పార్కుతో రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల దశ, దిశ పూర్తిగా మారిపోతుంది. ప్రభుత్వం నుంచి ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు లభిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకంగా ఉంది. అతి తక్కువ ధరలో పరిశ్రమల యజమానులకు ఇక్కడ ప్లాట్లు కేటాయించాం. చదరపు గజం ధర రూ. 1,600 లోపే ఉంది. చవకగా ప్లాట్లు లభిస్తుండటంతో పెట్టుబడి భారం తగ్గుతుంది.
-కొండవీటి సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు
దేశంలోనే మోడల్ ఇండస్ట్రియల్ పార్కు
భారీ పరిశ్రమలకు దీటుగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. టిఫ్ అభ్యర్థన మేరకు రెండేళ్ల క్రితం ప్రారంభమైన దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు పనులు ముగింపు దశకు చేరకున్నాయి. రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు టీఎస్‌ఐఐసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ దండుమల్కాపూర్ పార్కు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
– గ్యాదరి బాలమల్లు, టీఎస్‌ఐఐసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment