వచ్చీరాని కరెంటుతో తమకున్న ఎకరన్నర పొలం కాస్తా ఎండిపోవడంతో అప్పుల బాధ భరించలేక పార్వతి అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వచ్చీరాని కరెంటుతో తమకున్న ఎకరన్నర పొలం కాస్తా ఎండిపోవడంతో అప్పుల బాధ భరించలేక పార్వతి అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రంధన్ తండాకు చెందిన పార్వతి దంపతులకు ఒకటిన్నర ఎకరాల పొలం ఉంది. అయితే రోజుకు రెండు మూడు గంటలు కూడా కరెంటు సక్రమంగా రాకపోవడంతో ఆ పొలం కాస్తా ఎండిపోయింది.
వీళ్లు పిల్లలకు స్కూలు ఫీజులు కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నారు. దాంతో పిల్లలను శుక్రవారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి పంపేశారు. దాంతో భార్యాభర్తల మధ్య ఇదే విషయమై చర్చ కూడా జరిగింది. ఆ తర్వాతే.. పార్వతి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. ఆమెను వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే, ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా వాళ్ల దగ్గర డబ్బులు లేకపోవడంతో గ్రామస్థులు తలా కొంత డబ్బు వేసుకుని శవయాత్రకు ఏర్పాట్లు చేశారు.