
నాంపల్లి: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మేడ్చల్ జిల్లా సూరారం కాలనీ, భవానీ నగర్‌కు చెందిన పొన్నబోయిన శ్యామలాదేవి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)లో న్యాయవాది రాపోలు భాస్కర్‌తో కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. సూరారంలో మంత్రికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్య తనకు ఎకరా 33 గుంటల భూమి ఉందని, దీనిని కబ్జా చేసేందుకు మంత్రి యత్నిస్తున్నారని ఫిర్యాదులో శ్యామలాదేవి పేర్కొన్నారు. స్థానిక సంబంధిత అధికారులు కూడా మంత్రికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని ఆమె ఆరోపించారు. మంత్రి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి నుంచి ఆయన అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ మార్చి 13కు కేసుకు సంబంధించిన సమగ్రమైన నివేదికను అందజేయాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.