సాక్షి, సిటీబ్యూరో: ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను.. ఏ చదువు వల్ల చేపపిల్ల ఈదగలిగెను.. అంటూ ప్రశ్నించారెప్పుడో ఓ సినీకవి. మిగిలిన జీవులన్నింటికన్నా ఎన్నో విషయాల్లో తాను గొప్ప అని చెప్పుకొనే మనిషి మాత్రం చదువు లేక బతకలేనంటూ పారిపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి? లైఫ్ స్కిల్స్ లేకపోవడం. అంటే బతకడం ఎలాగో తెలియకపోవడం. చదువో, మరొకటో ఉంటేనే బతుకు బండి సాగుతుంది అనుకోవడం. అందుకే... మనిషికి జీవించడం ఎలాగో నేర్పాల్సిన సమయం వచ్చింది అంటున్నారు నగరానికి చెందిన లైఫ్ కోచ్ రాహుల్ జైన్. ఇంకా ఆయనేం చెబుతున్నారంటే..
నీట్‌లో తను అనుకున్న ర్యాంక్ రాలేదనే కారణంతో 18 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మరో చోట యూపీఎస్సీకి ప్రిపేరవుతున్న 28 ఏళ్ల వ్యక్తి 4 నిమిషాల ఆలస్యం కారణంగా పరీక్షకు అనుమతించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జాబ్ ఇంటర్వ్యూల్లో ఫెయిలవడం కావచ్చు.. ఫలితాల తర్వాత ఈ తరహా సంఘటనలు సాధారణంగా మారాయి. దీనికి ఎవరినీ తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు కానీ.. ప్రతి విద్యార్థికి, తల్లితండ్రులకు.. అత్యంత అవసరమైన లైఫ్ స్కిల్స్ విషయంలో మాత్రం ఎడ్యుకేట్ చేయడం లేదని చెప్పొచ్చు. పుస్తకాలు మాత్రమే కాదు చుట్టూ ఉన్న జీవితాల్ని చదవమని పిల్లలను ప్రోత్సహించాలి.
నేడే కాదు రేపూ ఉంది జీవితం..
స్కూల్‌లో నేనో సగటు విద్యార్ధిని. 60శాతం మార్కులు తెచ్చుకున్న ప్రతిసారీ తల్లిదండ్రులకు మరింత కష్టపడి చదివి 75 శాతం తెచ్చుకుంటా అని ప్రామిస్ చేసేవాణ్ని. కాని నా టెన్త్ క్లాస్ బోర్డ్ పరీక్షల్లోనూ 64 శాతం మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని రాష్ట్ర స్థాయి ర్యాంక్ తెచ్చుకున్నా. మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు కూడా అందుకున్నాను. డిగ్రీలో కాలేజ్ టాపర్స్‌లో ఒకడినయ్యాను. స్కూల్ టైమ్‌లో చదువులో ఫర్వాలేదు అనిపించుకున్న అదే విద్యార్థి ఆ తర్వాత రికార్డులు బద్ధలు కొట్టడం అంటే దానర్థం.. ఎవరూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండిపోరని.
మార్కులొకవైపు.. మార్గాలొకవైపు..
ఇప్పుడు పదేళ్ల తర్వాత.. నేనో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నాను. మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నాను. నాటి నా ర్యాంక్స్/ మార్క్స్/ జీపీఏల గురించి ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు. నేనే అప్పుడప్పుడు సరదాగా తీసి చూసుకోవడానికి తప్ప. మరోవైపు నాతో పాటు చదువుకున్న స్నేహితుల్లో అతి కష్టం మీద పరీక్షలు గట్టెక్కినవారు ఇప్పుడు వ్యక్తిగతంగానూ, వృత్తి పరంగానూ అద్భుతమైన రీతిలో విజయాలు సాధిస్తున్నారు. అంటే అర్థం మనం చదివే చదువు, మార్కులు మాత్రమే మన జీవితాన్ని నిర్ణయించేవి కావని. ఒక కాగితం ముక్క, లేదా కొన్ని మార్కులు, లేదా కొన్ని ర్యాంకులు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయించేవి అని అనుకోవద్దు. జీవితం అనేది ఒక దీర్ఘకాలిక ప్రయాణం. అందులో మరెన్నో ఇమిడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment