నగరంలో కల్లు దుకాణాలను తిరిగి తెరిపించే ప్రక్రియ మొదలైంది. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో 2004 జూన్ వరకున్న కల్లు దుకాణాలను తెరిపించేందుకు అధికార యంత్రాంగం పావులు కదుపుతోంది
విధి విధానాల రూపకల్పనలో ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్: నగరంలో కల్లు దుకాణాలను తిరిగి తెరిపించే ప్రక్రియ మొదలైంది. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో 2004 జూన్ వరకున్న కల్లు దుకాణాలను తెరిపించేందుకు అధికార యంత్రాంగం పావులు కదుపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న విధానానికి భిన్నంగా ఈ దుకాణాలను ఏర్పాటు చేయించాలనే ఆలోచనతో సర్కార్ ఉంది. స్వచ్ఛమైన కల్లును నల్లగొండ, కరీంనగర్ వంటి ఎంపిక చేసిన జిల్లాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు సాగించేలా యోచిస్తోంది. కల్లు గీత కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు నగరంలో కూడా ఈవృత్తినే నమ్ముకున్న గౌడ/ఈడిగ సామాజిక వర్గాల వారితోనే సొసైటీలు ఏర్పాటు చేయించి, వారిలోని పెత్తందారీ వర్గాల ఆధిపత్యం దుకాణాల్లో లేకుండా చూడాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్, ఎక్సైజ్ అధికారులతో మాట్లాడిన సీఎం విమర్శలకు తావులేకుండా, కల్లు గీత వృత్తిని నమ్ముకొని హైదరాబాద్‌కు వచ్చిన వారికి న్యాయం జరిగేలా నగర కల్లు విధానం ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక రూపొందించి త్వరలోనే సీఎంకు అందజేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. 2004కు ముందు దుకాణాలపై ఆధారపడ్డ గీత కార్మిక కుటుంబాలు, ఒక సామాజిక వర్గానికి చెందిన పేదలను పరిగణ లోకి తీసుకొని టీసీఎస్ (టాడీ టాపర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ)లను ఏర్పాటు చే యించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
గుత్తాధిపత్యానికి చెక్
ప్రస్తుతం ఉన్న విధానం మేరకు జిల్లాల్లో ఒక కల్లు కంపౌండ్‌లోని సొసైటీలో ఏ,బీ,సీ క్లాసుల వారీగా సభ్యులు ఉంటారు. అక్కడున్న ఆ సామాజిక వర్గం లోని పెద్ద మనుషులు కూర్చొని టీసీఎస్ సభ్యులను గుర్తిస్తారు. ఏ క్లాస్ సభ్యులు రూ. వెయ్యి చొప్పున, బీ-క్లాస్ సభ్యులు రూ. వంద చొప్పున , సీ- క్లాస్ సభ్యులు రూ. 10 చొప్పున రుసుము చెల్లించి సభ్యులుగా చేరుతారు. కల్లు అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని కూడా క్లాస్‌ల వారీగా పంచుకుంటారు. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో గతంలో కల్లు కాంపౌండ్‌లు కొందరి చేతుల్లోనే ఉండేవి. సభ్యులకు ఎంతో కొంత ముట్టజెప్పి, సింహభాగం వారి వద్దే ఉంచుకునే వారు. అలాగే కల్తీ కల్లు విక్రయాలు కూడా జోరుగా సాగేవి. ఈ పరిస్థితి లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, సొసైటీ సభ్యుల ఎంపిక నుంచి కల్లు విక్రయాల వరకు పారదర్శకంగా ఉండేలా విధానం రూపొంచే పనిలో ఎక్సైజ్ శాఖ ఉంది.