జాతీయ నేతల పంతం
కవులనాథుల్లో ఉత్కంఠ
కరీంనగర్ ఎంపీ టిక్కెట్ ఎవరికో..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కమలం గూటిలో టికెట్ల ఉత్కంఠ కొనసాగుతోంది. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీకి చెందిన ఇద్దరు జాతీయ స్థాయి నాయకులు పోటీపడుతుండటం ఆసక్తి రేపుతోంది. కమలనాథులందరి నోటా వీరిద్దరిపైనే చర్చ జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ఈ సీటును ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికీ అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.
గతంలో ఆ పార్టీకి ఇక్కడ గెలిచిన చరిత్ర ఉండటం, తెలంగాణ ప్రాంతంలో పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావటంతో పార్టీ నేతలు ఈ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. టీడీపీతో ఉన్నత స్థాయిలో పొత్తు కుదరడం, ఆ పార్టీలో లోకసభకు పోటీచేసే సరైన అభ్యర్థి లేకపోవడంతో, సర్దుబాటులో ఈ సీటు ఖచ్చితంగా తవుకే దక్కుతుందని బీజేపీ ధీవూతో ఉంది. అందుకే.. ఎంపీ అభ్యర్థిత్వాల చర్చ జోరందుకుంది.
గతంలో ఇక్కడ పోటీ చేసి గెలిచిన విద్యాసాగర్‌రావు కేంద్రంలో మంత్రిగా పని చేశారు. ఈసారి ఆయనకు పోటీగా మురళీధరరావు ఇదే సీటు కోరుతుండటంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కత్తిమీద సాములా తయారైంది. వీరిద్దరి పేర్లను రాష్ట్ర పార్టీ ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించినట్లు తెలుస్తోంది. వీరిరువురు కూడా ఎన్నికల కమిటీలో ఉండడం విశేషం.
ఏడాదిగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ ఇద్దరు నేతల హడావుడి పార్టీ శ్రేణుల్లో కొత్త హుషారు తెచ్చిపెట్టింది. ఈసారి తనకే సీటు దక్కుతుందని ధీమాతో ఉన్న విద్యాసాగర్‌రావు తనదైన శైలిలో నియోజకవర్గంలో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో మమేక మవుతున్నారు. తన కున్న పాత పరిచయాలతో ముఖ్య నేతలను చేరదీసే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు.
కొత్తగా జిల్లా తెరపైకి వచ్చిన మురళీధరరావు వినూత్న కార్యక్రమాలతో వేగం పెంచారు. జాతీయ నాయకులతో ఉన్న సాన్నిహిత్యాన్ని వినియోగించుకుని పార్టీ కార్యక్రమాలు.. ప్రచారాన్ని హోరెత్తించారు. ఉత్తర తెలంగాణలోని సామాజిక సమస్యలు... పరిష్కారం పేరిట... సదస్సులను నిర్వహిస్తూ ఆయా వర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ఎత్తులు వేశారు.
వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ఇద్దరి మధ్య పోటీ బిగ్ ఫైట్‌ను తలపిస్తోంది. ఇటీవలి జాతీయ కౌన్సిల్ సమావేశాల తర్వాత మురళీధర్‌రావు పార్టీ కార్యకలాపాల వేగం మరింత పెంచారు. సోషల్ వెబ్‌సైట్లు, మిస్డ్ కాల్ ఇస్తే నేరుగా మాట్లాడే.. అధునాతన ప్రచార హంగులను వినియోగిస్తున్నారు. నమో టీమ్‌లతో పాటు రెండు ప్రచార రథాలను రంగంలోకి దింపారు.
పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి, మురళీధర్‌రావు ఫొటోలతో ఇంటింటికో స్టిక్కర్, కరపత్రాలు పంచుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉందనే ప్రచారంతో ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ఇద్దరు నేతలు తమతమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు అనుకూలంగా ఉన్న జాతీయ నేతలతో పావులు కదుపుతున్నారు.
ఇద్దరూ ఇద్దరే..
Published Tue, Mar 18 2014 1:06 AM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM
Advertisement
Advertisement