నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పీజీ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సమాచారం. మే 16న జరిగిన ఎంఏ మాస్ కమ్యూనికేషన్ నాలుగో సెమిస్టర్ మొదటి పేపర్‌లోని ప్రశ్నలు బయటికి పొక్కినట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెండు రోజుల ముందే ఈ ప్రశ్నలు బయటకు పొక్కినట్లు తెలుస్తోంది.
యూనివర్సిటీ పీజీ పరీక్షలు మే 16 నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, సాధారణంగా పీజీ పరీక్ష పత్రాలను ఇతర యూనివర్సిటీల ప్రొఫెసర్లతో తయారు చేయించి తెప్పిస్తుంటారు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ కోర్సుకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రశ్నపత్రాన్ని తెప్పించినట్లు సమాచారం. ఈ పత్రాలు పరీక్షకు కొద్ది రోజుల ముందు యూనివర్సిటీకి చేరుతాయి.
ఆ పత్రాల్లో ఏమైన అక్షర దోషాలు, తప్పులు, సవరణలు చేయాల్సిన ప్రక్రియ మోడరేషన్‌ను చేపట్టిన అనంతరం పరీక్ష నిర్వహిస్తారు. మోడరేషన్ సందర్భంగా ఈ పేపర్‌లోని ప్రశ్నలు బయటకు పొక్కాయా? లేక ఇంకా ఏదైనా సందర్భంలో జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఏ మాస్ కమ్యూనికేషన్‌కు సంబంధించి ప్రశ్నలు బయటికి పొక్కినట్లు సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం.
పరీక్షలో ఏయే ప్రశ్నలు వస్తాయనే అంశంపై వివరిస్తున్న సంభాషణ వాట్సాప్‌లో తిరుగుతోంది. ఈ విషయమై వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాంబయ్యను సంప్రదించగా, ప్రశ్నపత్రం బయటికి పొక్కిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. సాధారణంగా పీజీ పరీక్ష పత్రాలు లీకయ్యే అవకాశాలుండవన్నారు. ఇవన్నీ వదంతులు కావచ్చని, అయినా.. విషయం పరిశీలిస్తానని చెప్పారు.