
చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం
ఓటుకు నోటు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని, తెలంగాణ సీఎం కేసీఆర్ దోపిడీదారుడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
వరంగల్: ఓటుకు నోటు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని, తెలంగాణ సీఎం కేసీఆర్ దోపిడీదారుడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు భజన పరులుగా ఉంటున్నారని... అలా ఉన్నవారు వచ్చే ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో గుడిసెవాసుల హక్కుల ఐక్య వేదిక సభ ఆదివారం జరిగింది.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల పక్షాన నిలబడకుండా దొరలకు వత్తాసు పలుకుతూ దోపిడీదారుడిగా మారాడని విమర్శించారు. పేదల కోసం పోరాటం చేసే వాళ్లే జయశంకర్ సార్‌కు వారసులన్నారు. కేసీఆర్‌కు ప్రతిపక్షాలంటే భయం లేదని.. కేవలం ఎమ్మార్పీఎస్ అంటేనే భయపడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించారన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన చంద్రబాబు ఆ తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్నారు. పేదలు వేసుకున్న గుడిసెల విషయంలో ప్రభుత్వం పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు.