
‘మావో’ల పోస్టర్ల కలకలం
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలో బుధవారం రాత్రి మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. చౌటుప్పల్-వలిగొండ రోడ్డుపై, మండలంలోని తాళ్లసింగారం గ్రామ ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న గ్రామ సూచిక బోర్డుకు ఒకటి, హైవేపై లింగోజిగూడెం స్టేజీ వద్ద మరో రెండు పోస్టర్లు వెలిశాయి. గురువారం తెల్లవారుజామునే పోస్టర్లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు హుటాహుటీనా వెళ్లి, పోస్టర్లను తొలగించారు.
పోస్టర్లపై పీఎల్‌జీఏ వారోత్సవాలను జయప్రదంచేయాలి, మావోయిస్టులు వర్థిల్లాలి, కేసీఆర్‌ది నియంతృత్వ పాలన, రైతులు, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడాలి, అమరుల ఆశయాలను సాధిస్తాం, అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం అని మావోయిస్టు పార్టీ పేరు రాసి ఉంది. కాగా, ఇటీవలి కాలంలో సంస్థాన్ నారాయణపురం, దేవిరెడ్డి బంగ్లా, చండూరు మండలం గట్టుప్పల్ లో, రెండు రోజుల క్రితం గుర్రంపోడు మండలంలో వరుసగా పోస్టర్లు వెలుస్తుండడంతో మావోల కదలికలపై అనుమానం రే కెత్తుతోంది. పోలీసులు ఆకతాయిల పనేనని పైకి కొట్టిపారేస్తున్నా, లోలోన మాత్రం మదనపడుతున్నారు. చౌటుప్పల్‌లో వెలిసిన పోస్టర్లు నకిలీల పనేనని పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు కొట్టిపారేశారు.