సర్వం.. సర్వేనే
గ్రేటర్‌లో ఆసక్తి చూపిన రాజకీయ, సినీ ప్రముఖులు
సమగ్ర వివరాలు అందజేసిన గవర్నర్ నరసింహన్
వివరాలిచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
బాబు ఇంటికి స్టిక్కర్లు అంటించకుండా అడ్డుకున్న సిబ్బంది
నిరాకరించిన పవన్ కళ్యాణ్, విజయశాంతి
హైదరాబాద్: మహానగరంలో మహాసన్నివేశం ఆవిష్కృతమైంది. అపూర్వ ఘట్టం నమోదైంది. సర్వే మినహా సకలం బంద్. ఇంటింటా అదే సందడి. గల్లీగల్లీలో అదే కోలాహలం. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్‌లో సక్సెస్ అయింది. విశేష స్పందన లభించింది. వివరాలు చెబుతూ కుటుంబసభ్యులు.. సర్వేఫారాలు నింపుతూ ఎన్యూమరేటర్లు కనిపించారు. పేద, ధనిక తేడాలేకుండా అందరూ సర్వేపట్ల ఆసక్తి కనబర్చారు. గవర్నర్ నరసింహన్, ఆయా పార్టీల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు సర్వేలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేటర్‌కు తన కుటుంబానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని పలువురు ప్రముఖులు ఆసక్తి చూపగా, కొంతమంది సెలబ్రిటీలు ముఖం చాటేశారు. లోటస్‌పాండ్‌లో నివాసం ఉంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి షేక్‌పేట తహసీల్దార్, బంజారాహిల్స్ నోడల్ అధికారి చంద్రకళ నేతృత్వంలో ఎన్యూమరేటర్ల బృందానికి సాయంత్రం 6:30 గంటలకు వివరాలను అందజేశారు. అడిగి అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉదయం నుంచి తాను అసెంబ్లీలో ఉండటం వల్ల రాలేకపోయానని జగన్ తెలిపారు.
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, నటుడు తనికెళ్ల భరణి, జూనియర్ ఎన్టీఆర్, అల్టు అర్జున్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావు, రవాణా శాఖామంత్రి మహేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ ఎంకే.మీనా, నవీన్ మిట్టల్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తదితరులు సర్వేకు సహకరించి, కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్, మాజీ ఎంపీ విజయశాంతి వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు వివరాలు అందజేశారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన కుటుంబ వివరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నా సేకరించడానికి ఎన్యూమరేటర్లు రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబానికి సబంధించిన వివరాలను ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో అందుబాటులో ఉంచగా ఎన్యూమరేటర్ మానయ్య వాటిని అక్కడి నుంచి సేకరించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంటికి కూడా స్టిక్కర్ అంటించేందుకు ఒప్పుకోలేదు.
గ్రేటర్‌లో 80 శాతం
గ్రేటర్ నగరంలో 2011 జనాభా లెక్కల మేరకు 15.24 లక్షల కుటుంబాలుండగా, రాత్రి 8 గంటల వరకు 15.50 లక్షల కుటుంబాల సర్వే పూర్తయినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. మరో నాలుగైదు లక్షల కుటుంబాలు మిగిలి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన గ్రేటర్‌లో దాదాపు 80 శాతం సర్వే జరిగిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సరైన వివరాలు బుధవారం మాత్రమే తెలిసే వీలుందన్నారు.
సర్వే బాగుంది: లింగ్డో
శంకర్‌పల్లి: కుటుంబ సమగ్ర సర్వేలో భారత ఎన్నికల మాజీ కమిషన్ జేఎం లింగ్డో వివరాలు నమోదు చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని పొద్దుటూర్ ప్రగతి రిసార్ట్‌లో నివాసం ఉంటున్న లింగ్డో ఇంటికి వెళ్లారు. ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలను ఆయన అందజేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే బాగుందని, ఈ సర్వేతో ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి అన్ని విషయాలూ తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఎన్యూమరేటర్‌గా జీహెచ్‌ఎంసీ కమిషనర్
సమగ్ర కుటుంబ సర్వేలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్వయంగా పాల్గొని కాసేపు ఎన్యుమరేటర్ పాత్ర కూడా పోషించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, సర్కిల్-7 పరిధిలో నగర మేయర్ మాజిద్ హుస్సేన్ నివాసానికి సర్వే సిబ్బందితో పాటు కమిషనర్ కూడా వెళ్లి సర్వే నిమిత్తం కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. మరోవైపు రాజేంద్రనగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సర్కిల్-9 పరిధిలో డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ నివాసాలకు ఉన్నతాధికారులు వెళ్లి వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు.
హర్షణీయం: జస్టిస్ చంద్రకుమార్
ప్రజల సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం రాత్రి ఎల్‌బీనగర్ హస్తినాపురంలోని ఆయన నివాసానికి వచ్చిన ఎన్యూమరేటర్‌కు కుటుంబ సమాచారం అందజేశారు. చంద్రకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని పదిలంగా ఉంచి దుర్వినియోగ పరచడానికి అవకాశం కల్పించకుండా ఉండాలి. సర్వేతో పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే హర్షనీయమని ఆయన పేర్కొన్నారు.