గేట్ ఎత్తేందుకు మోటార్ ఆన్ చేస్తున్న ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు
ధర్మారం (ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌లోకి గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం వరకు రెండు అండర్ టన్నెల్‌ల ద్వారా 500 క్యూసెక్కులు విడుదల చేశారు. మోటార్ల వద్ద విశాఖపట్నంకు చెందిన పది మంది గజ ఈతగాళ్లతో లీకేజీ తనిఖీలు, మరమ్మతులు పూర్తి కావడంతో సోమవారం నీటి ప్రవాహం పెం చారు. పాలకుర్తి మండలం ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ వద్ద కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్, సాంకేతిక నిపుణుడు పెంటారెడ్డి సోమవారం ఉదయం రెండు గేట్లు ఎత్తి 1,000 క్యూసెక్కుల నీరు సర్జిపూల్‌కు విడుదల చేశారు.
సర్జిపూల్ మోటార్‌కు నీటి విడుదల
సర్జిపూల్‌లో కీలకమైన రెండో ఘట్టం విజయవంతమైంది. 6వ ప్యాకేజీ మేడారంలో నిర్మించిన సర్జిఫూల్‌లో సోమవారం రాత్రికి నీటిమట్టం 133.004 మీటర్లకు చేరడంతో కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, సాంకేతిక సలహాదారుడు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ మొదటి మోటార్ వెట్‌రన్‌కు అవసరమైన నీటికి గేట్ ఎత్తి విడుదల చేశారు. సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి లాంఛనంగా సర్జిఫూల్ గేట్ ఎత్తడంతో పంప్‌హౌస్‌లోకి నీరు చేరింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్జిపూల్‌లోనే ఉన్న ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్, సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి నీటిమట్టాన్ని మోటార్ల వెంట్‌రన్‌కు అవసరమైన చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.
ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని నిర్ధారణ కావడంతో 6:30 గంటలకు లాంఛనంగా స్విచ్ ఆన్ చేసి గేట్ ఎత్తడంతో నీరు మోటార్ వద్దకు చేరి వెట్‌రన్‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇంకా ఏమైనా లీకేజీలు ఉన్నాయో గుర్తించేందుకు మంగళవారం గజ ఈతగాళ్లను మళ్లీ సర్జిపూల్‌లోకి దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్నీ తనిఖీ చేసిన తర్వాత ఈనెల 24న వెట్‌రన్ ద్వారా మూడో ప్రక్రియలో మోటార్లు రన్‌చేసి నీటిని మేడారం రిజర్వాయర్‌లోకి లిఫ్ట్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment