
సాంబశివరావు తదుపరి పోస్టింగ్ ఏమిటి?
ఆది నుంచి అక్రమాలే ఎజెండా..
ఇన్వర్టర్ల కుంభకోణం మచ్చ
ఉద్యోగ నియామకాల్లో అదేదారి
వివాదాల నడుమ పదోన్నతులు
వరంగల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య, ఆరోగ్య శాఖ అక్రమాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించిన సాంబశివరావు తదుపరి పోస్టింగ్ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సాంబశివరావు వరంగల్ జిల్లా వైద్యాధికారిగా పని చేస్తూ.. వేగంగా వైద్య, ఆరోగ్య శాఖ డెరైక్టరు పోస్టు దక్కించుకున్నారు. అవినీతి, అక్రమాల ఆరోపణలతో ప్రభుత్వం సాంబశివరావును ఆ పోస్టు నుంచి తప్పించింది. ఇప్పుడు సాంబశివరావు మళ్లీ ఇదే పోస్టులోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సహకారంతో ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టింగ్ పొందుతారని సాంబశివరావు అనుచరులు చెబుతున్నారు. ఈ రెండింట్లో ఏది జరిగినా జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా దయనీయంగా చేరుకుంటుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆది నుంచి అదేతీరు..
సాంబశివరావు 2011 డిసెంబరు నుంచి జూలై 2014 వరకు జిల్లా వైద్య అధికారిగా పనిచేశారు. ఆయన పని చేసిన కాలంలో అవినీతి, అక్రమాల ఆరోపణలు భారీగా వచ్చాయి. ముఖ్యంగా ఇన్వర్టర్ల కొనుగోలు విషయంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఏటా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తుంది. జిల్లాలో 62 పీహెచ్‌సీలు ఉన్నారుు. 2012 డిసెంబరులో ప్రతీ పీహెచ్‌సీకి రెండు చొప్పున ఇన్వర్టర్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఇన్వర్టర్లుకు రూ.40 వేలు చెల్లించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ పి.సాంబశివరావు ఉన్నప్పుడే ఇన్వర్టర్ల కొనుగోలు విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చారుు. ఎస్సీ, ఎస్టీ జిల్లా అసోసియేషన్‌తోపాటు పలువురు వ్యక్తులు ఈ అంశంపై 2013లో ఫిర్యాదులు చేశారు. 2013 జులైలో అప్పటి ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జిల్లాకు వచ్చి దీనిపై విచారణకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డెరైక్టర్ మాణిక్యరావును విచారణ అధికారిగా నియమించారు. ఇందుకు సంబంధించిన విచారణ పూర్తయ్యిందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నివేదికలో ఏముందనే విషయాలను ఇప్పటికీ వెల్లడించలేదు.
మరికొన్ని..
సాంబశివరావుపై ఆరోపణలకు సంబంధించి ఏకంగా వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదులు వెళ్లాయి. 2012, 2014 మేడారం జాతరలో వైద్య శాఖ నిర్వహించిన క్యాంపుల పేరిట భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు జాతరల్లోనూ రూ.కోటి చొప్పున వైద్య శాఖ తరుఫున ఖర్చు చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండా మందులు, అత్యవసర వస్తువుల కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సాధారణ నిధుల విషయంలోనూ ఇలాగే జరిగినట్లు ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగంతోపాటు పోస్టింగ్‌ల విషయంలోనూ అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫార్మసిస్టు, ఎస్‌పీహెచ్‌వో పోస్టింగ్‌లు, డిప్యూటేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. ఈ అంశాలపై అప్పటి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినా తుది నివేదిక పరిస్థితి ఏమిటనేది వెల్లడికాలేదు. రాజకీయ అండదండలతో సాంబశివరావు ఏకంగావైద్య, ఆరోగ్య శాఖ ఉన్నత పదవికి దక్కించుకున్నారు. ఉన్నతమైన పోస్టులో ఉండి కూడా వ్యవహారశైలి మార్చుకోకపోవడంతో కొద్ది కాలంలోనే ఈ పోస్టు నుంచి వైదొలిగారు.