సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఖాళీ అయిపోయాయి. ఖరీదైన మందుల సంగతేమో కానీ సాధారణ బీపీ, షుగర్, బి–కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకని పరిస్థితి తలెత్తింది. ఆస్పత్రిలో మందులు అయిపోయాయని, రోగులకు అవసరమైన మందులను వెంటనే పంపించాల్సిందిగా ఉస్మానియా ఆస్పత్రి ఫార్మసీ విభాగం.. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఎంఐడీసీ)కి మూడుసార్లు ఇండెంట్లు పంపినా ఎలాంటి స్పందనా లేదు. నెల రోజుల్లో మూడు సార్లు ఇండెంట్లు పంపితే.. ఇండెంట్ పంపిన ప్రతిసారి ‘సరఫరా లేదంటూ’ తిప్పపంపడం గమనార్హం. ఇది ఒక్క ఉస్మానియా లోనే కాదు ప్రతిష్టాత్మాక గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ, పేట్లబురుజు, సుల్తాన్ బజార్, ఫీవర్, ఛాతి, మానసిక చికిత్సాలయాలతో పాటు సరోజినిదేవి కంటి ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. రోగుల అవసరాలతో సంబంధం లేకుండా మందులు కొనుగోలు చేయడం, తర్వాత ‘ఎక్సైఫైరీ’ పేరుతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా పారబోయడం పరిపాటిగా మారింది. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రి ఫార్మసీలో మందులు లేకపోవడంతో వైద్యుడు రాసిన చీటి పట్టుకుని రోగి బంధువులు ప్రైవేటు పార్మసీలను ఆశ్రయింయించే పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వివిధ సర్జరీలు చేయించుకుని, డిశ్చార్జైన రోగులకు తర్వాత నెలవారి ఫాలోప్ మందులు సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
అక్కడ సగం మందులతోనే సరి..
ఇక వనస్థలిపురం, మలక్‌పేట్, కింగ్‌కోఠి, గోల్కొండ, కొండాపూర్, నాంపల్లి, లాలాపేట్ ఏరియా ఆస్పత్రుల్లో పరిస్థితి మరోలా ఉంది. ఒక్కో ఆస్పత్రి వంద పడకల సామర్థ్యం ఉంటుంది. వాటిలో ఆర్థో, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాలు సైతం ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి మందుల కోసం ప్రతి మూడు నెలలకు ఓసారి రూ.3.5 లక్షల చొప్పున మంజూరు చేస్తుంది. 145 రకాల మందులు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. ఆయా ఆస్పత్రుల్లో 30–35 రకాలకు మించి దొరకడం లేదు. ఒక్కో గర్భిణికి 100 బికాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆస్పత్రికి ప్రతిరోజూ వంద మంది గర్భిణులు వస్తే ఒక్కొక్కరికి 30 గోళీల చొప్పున రోజుకు 3000 గోలీలు అవసరం. కానీ రోగుల నిష్పత్తికి తగినన్ని మందులు లేకపోవడంతో పది రాస్తే.. ఐదు గోళీలు ఇచ్చి పంపుతున్నారు. బి–కాంప్లెక్స్, కాల్షియం, డయోనిల్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మందులతో పాటు ‘ఐసాక్స్ సుఫ్రిన్ హెచ్‌సీఎల్’ ఇంజెక్షన్లు కూడా దొరకడం లేదు. రోగులే వీటిని సమకూర్చు కోవాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల అంతర్గత నిధులను వెచ్చించి కొనుగోలు చేసి, వాడుతున్నారు.
బయట కొనుక్కోమన్నారు..
మాదాపూర్‌కు చెందిన రత్తమ్మ(40) దినసరి కూలీ. రెండు రోజుల క్రితం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. గాయాలపాలైన రత్తమ్మను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ మందులు లేవని చెప్పి వైద్యులు బయట నుంచి మందులు తెచ్చుకోమన్నారని రత్తమ్మకు సహాయకురాలుగా ఉన్న ఆమె కూతురు సుశీల పేర్కొంది. రూ.150 విలువ చేసే మందులను కొనుగోలు చేశానని తెలిపింది.
మందులు లేవన్నారు..
నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన రెహనాబేగంకు చేతి రెక్కలు నొప్పిగా ఉండడంతో ఉస్మానియాలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమెకు కుమారుడైన హైదర్ సహాయకుడిగా ఉన్నాడు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో రెహనాబేగం వైద్యానికి కావాల్సిన మందులు లేవని వైద్యులు బయట నుంచి తెచ్చుకోవాలని చెప్పారు. దీంతో అతడు ఆస్పత్రి ఆవరణలోని మెడికల్ షాపులో కొనుగోలు చేశాడు. ఉస్మానియా ఆస్పత్రిలో సైతం మందులు లేకపోవడం శోచనీయం.
అత్యవసరం మేరకు కొంటున్నాం
ఉస్మానియా ఆస్పత్రిలో అత్యవసర మందులు సరఫరా పూర్తిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ద్వారా జరుగుతుంది. అన్ని విభాగాల విభాగాధిపతులను సంప్రదించి వారి సూచనల మేరకు కమిటీ అత్యవసర మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా చేస్తారు. టీఎస్‌ఎంఐడీసీ ద్వారా సరఫరా కాని మందులను ఆయా విభాగాధిపతుల సిఫార్సు మేరకు ఆస్పత్రి అంతర్గత నిధుల ద్వారా సమకూర్చుతున్నాం. కొత్తగా అవసరమైతే, ఆ విభాగం కమిటీ సూచనతో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పిస్తు న్నాం. – నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రిసూపరింటిండెంట్
Comments
Please login to add a commentAdd a comment