మళ్లీ పెరగనున్న పాల ధర
హైదరాబాద్: పాల ధర మళ్లీ పెరగనుంది.డిమాండ్‌కు తగ్గట్టుగా పాల సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టోన్డ్ మిల్క్ ధర రెండు రూపాయలు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. 10-15 రోజుల్లో ఈ సవరణ పూర్తి చేయాలని కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టోన్డ్ పాల ధర లీటరుకు రూ.42 ఉండగా విజయ బ్రాండ్ మాత్రమే రూ.41కు విక్రయిస్తోంది. ప్రైవేటు రంగంలోని హెరిటేజ్, జెర్సీ బ్రాండ్లు తాజాగా హోల్ మిల్క్ ధరను రూ.2 పెంచడంతో లీటరు రూ.56కు చేరింది. జెర్సీ టోన్డ్ ప్రీమియం ధర రూ.42 నుంచి రూ.44కు చేరింది. టోన్డ్ మిల్క్ ధరను కూడా ఈ కంపెనీలు పెంచుతాయని డీలర్లు చెబుతున్నారు.
పాల కొరత, దాణా సమస్యలు
దేశంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పాల సరఫరా లేదు. ప్రస్తుతం పాల కొరత 20 శాతం దాకా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ స్థాయిలోనే కొరత ఏర్పడిందని నల్గొండ-రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ (నార్ముల్) చైర్మన్ జి.జితేందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అముల్, నందిని రాకతో తెలుగు రాష్ట్రాల్లో పోటీ తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ కంపెనీలు తక్కువ ధరకు విక్రయించడంతో ఇతర కంపెనీలు ధర తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని కంపెనీల ధర ఒకేలా ఉంది. మరోసారి ధర సవరించాల్సి వస్తోంది. పాల కొరతకు తోడు దాణా ఖర్చులు అధికంగా ఉండడం కూడా ఇందుకు కారణం. విజయ డెయిరీ రైతులకు లీటరుకు ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహం అందిస్తోంది. నార్ముల్‌కు కూడా దీనిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం అని వివరించారు.
ఇక దాణా విషయానికి వస్తే క్వింటాలు దాణా ధర 2014లో రూ.1,600 పలికింది. ఇప్పుడు రూ.2,100 ఉంది. జనవరి-ఫిబ్రవరిలో ఇది రూ.2,500 దాకా వెళ్లింది. అవసరానికి తగ్గట్టుగా గడ్డి కూడా దొరకడం లేదు. దాణా ధరలు పెరగడం భారంగా ఉందని మహబూబ్‌నగర్ సమీపంలోని చుక్మాపూర్ పాడి రైతు రామకృష్ణారెడ్డి తెలిపారు. నాణ్యతనుబట్టి లీటరుకు రూ.33 దాకా రైతుకు వస్తున్నా ఖర్చులు పెరగడంతో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోందని చెప్పారు. వర్షాలు ప్రారంభమైతేగానీ గడ్డి లభ్యత సాధ్యం కాదని జితేందర్‌రెడ్డి తెలిపారు.