ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ కూలీ దినాల్లో భాగంగా ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూలీ పని చేశారు. కొంపల్లిలోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో శుక్రవారం ఆయన ఐస్‌క్రీమ్ అమ్మి రూ.లక్షలు సంపాదించారు. ఒక ఐస్‌క్రీమ్‌కు ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు కొనగా, మరో ఐస్‌క్రీమ్‌కు స్థానిక నేత శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రూ.లక్ష చెల్లించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో ఈనెలలో జరగనున్న బహిరంగ సభకు విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ఐస్ క్రీమ్ అమ్మారు.
అలాగే కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ జ్యూస్, ఐస్‌క్రీమ్ అమ్మారు. ఓ భవన నిర్మాణంలో కాసేపు ఇంజినీర్‌గా పనిచేశారు. మొత్తం 25 నిమిషాల పనికి మంత్రి కేటీఆర్‌కు రూ.7.30 లక్షల కూలి గిట్టుబాటు అయింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, బాల్క సుమన్, వివేకానంద, శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఆనంతరం అక్కడి బస్తీవాసులతో ముచ్చటించారు. టీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను, ప్రజలను కోరారు.
కాగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గులాబీ కూలీ దినాలుగా పాటించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 21న టీఆర్‌ఎస్ ప్లీనరీని అదేవిధంగా 27వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు శ్రమదానం చేసి ప్లీనరీ, బహిరంగ సభకు విచ్చేసే నిమిత్తం ఎవరి సొంత ఖర్చులకు వారే సంపాదించుకోవాలని సూచించారు. దీంతో మంత్రి కేటీఆర్ మరో రెండు రోజులు నగరంలో కూలీ పనులు చేయనున్నారు.