ఖమ్మం వ్యవసాయం: రాష్ట్రంలో ‘తేజ’రకం మిర్చి ధర రూ.20 వేలు దాటింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజ రకం మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం రూ.20,021 ధర పలికింది. మిర్చి పంట సాగు చరిత్రలో ఈ ధర అత్యధికం. గురువారం మిర్చి ధర రూ.18,600 పలకగా, ఆ ధర రూ.1,400లకు పైగా పెరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నర్సింహాపురానికి చెందిన రామా రావుకు చెందిన మిర్చికి వ్యాపారులు ఈ ధర పెట్టారు. ఈ ఏడాది ఆయా దేశాల్లో వర్షాలు, వాతావరణ కారణాలతో మిర్చి పంట ఆశించిన స్థాయిలో లేదని, దీంతో ఇక్కడ పండించిన పంటకు డిమాండ్ పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. మన దేశంలో కూడా పంట అంత ఆశాజనకంగా లేకపోవడంతో గతేడాది పండిన పంటకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది పండించిన పంట ను వ్యాపారులు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు పెట్టారు. ఆ నిల్వలకు జూన్ నుంచి ధర పెరుగుతూ వస్తోంది. జూన్‌లో రూ.11 వేలు పలికిన ధర నవంబర్ నాటికి రూ.20 వేలకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో కూడా రికార్డు స్థాయిలో క్వింటా మిర్చి ధర రూ. 19,500 పలికింది.
Comments
Please login to add a commentAdd a comment