తల్లాడలో మాట్లాడుతున్న బాలకృష్ణ. చిత్రంలో రమణ, సండ్ర, నామా (ఇన్‌సెట్)మిట్టపల్లిలో టీడీపీ జెండాలను తగులబెడుతున్న అభిమానులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ప్రాంత అభివృద్ధికి పాటుపడింది తెలుగుదేశం పార్టీయేనని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బాలకృష్ణ విస్తృతంగా పర్యటించి ఒకవైపు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించడం.. మరోవైపు తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన మధిర మండలం రాయపట్నంకు చేరుకున్న బాలకృష్ణ రాత్రి వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. దెందుకూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ ఈ సందర్భంగా జరిగిన సభలో ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు.
పేద, బడుగు, బలహీన వర్గాల అండతోనే టీడీపీ ఆవిర్భవించిందని, అదే తోడ్పాటుతో ఇంతింతై ఈ స్థాయికి ఎదిగిందన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతోనే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రూ.2కు కిలోబియ్యం పథకాన్ని అమలు చేసి.. ప్రతి ఇంటికి ఆత్మీయుడిగా మారారని గుర్తు చేశారు. పేదల సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగించే శక్తి, ప్రజలపై మమకారం కేవలం టీడీపీకే ఉందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను, తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాటి ముఖ్యమంత్రులు ఎన్‌టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, పేదలకు ఇళ్ల నిర్మాణంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు వారి హయాంలోనే పేదల చెంతకు చేరాయన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పేర్కొన్న బాలకృష్ణ.. తెలంగాణలోని ప్రతి గ్రామం టీడీపీకి ఆత్మీయ గ్రామమని, అందరి అండదండలు తమకుంటాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కలిసి మహాకూటమి రాష్ట్రంలో ఏర్పడిన తరుణంలో బాలకృష్ణ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం సందడి చేశారు. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అనుచరులు బాలకృష్ణ పర్యటనలో కాంగ్రెస్ జెండాలతో సహా పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన ప్రదర్శనల్లోనూ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు కలిసి పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కల్పించింది. మధిరలో జరిగిన బాలకృష్ణ పర్యటనలో మధిర కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య కాంగ్రెస్ కార్యకర్తలతో సహా వెళ్లి పాల్గొన్నారు. బాలకృష్ణ పర్యటన అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా కొనసాగింది.
మధిర మండలం దెందుకూరు నుంచి ప్రారంభమైన బాలకృష్ణ పర్యటన మధిర, నారాయణపురం, ఆళ్లపాడు, సోమవరం, గొల్లపూడి తదితర ప్రాంతాల మీదుగా వైరాకు చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించి.. ప్రసంగించారు. వైరా నుంచి తల్లాడ మీదుగా మధ్యాహ్నం భోజనం కోసం మిట్టపల్లిలో ఆగిన బాలకృష్ణ టీడీపీ నేత రాయల శేషగిరిరావు నివాసంలో భోజనం చేశారు. అక్కడి నుంచి సత్తుపల్లి సభకు బయలుదేరుతున్న సమయంలో తనను చూడటం కోసం కాన్వాయ్‌ని ఆపడానికి ప్రయత్నించిన అభిమానులను కాలుతో తన్నడంతో అభిమానులు ఆగ్రహం చెంది.. పార్టీకి చెందిన ఫ్లెక్సీలు, బాలకృష్ణ ఫ్లెక్సీలను దహనం చేశారు. అనంతరం బాలకృష్ణ కల్లూరు, పెనుబల్లి, మండాలపాడు, లంకపల్లి మీదుగా సత్తుపల్లి చేరుకున్నారు.
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. టీడీపీ ప్రజల పార్టీ అని, వెంకటవీరయ్యను గెలిపించడం ద్వారా టీడీపీ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటవీరయ్య ప్రజాసేవలో అందరివాడు అనిపించుకున్నారని ప్రశంసించారు. సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, వాసిరెడ్డి రామనాథం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment