కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గానికి త్వరలో ఎనిమిది వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ప్రకటించారు. శనివారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో ఆసరా పింఛన్ లబ్దిదారులకు పెరిగిన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొనగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నియోజకవర్గానికి ఎనిమిది వేల డబుల్ బెడ్రూంలను మంజూరు చేయించి నియోజకవర్గంలోని పేదలందరికీ గూడు కల్పిస్తానని చెప్పారు. కాగా రాబోయె రెండేళ్లలో కాళేశ్వరం నీళ్లు నియోజకవర్గానికి రానున్నాయని, సీఎంతో మాట్లాడి కాళేశ్వరం నీళ్లు ఎక్కువ వచ్చేలా చేస్తానని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు వస్తే కరువు ఉండదని నీటి సమస్య కూడా ఉండదన్నారు. కాగా గ్రామాలు, పురపాలక సంఘాలను మరింత అభివృద్ధి చేసే దిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ మురికి కాలువలు నిర్మిచేందుకు సీఎం ఆలోచిస్తున్నారని చెప్పారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఎవరికి వారు తమ బాధ్యతలను నెరవేర్చాలని మదన్‌రెడ్డి సూచించారు. పార్టీలకు అతీతంగా సమష్టిగా ముందుకు సాగితేనే గ్రామాలు పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. కాగా గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పింఛన్ సొమ్మును పెంచారని తెలిపారు. త్వరలో సీఎం జిల్లాలో పర్యటించి సమీక్ష జరిపి అక్కడే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని మదన్‌రెడ్డి పేర్కొన్నారు. వేసవిలో నీటి కొరత తలెత్తగా సర్పంచ్‌లు, అధికారులు నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment