వెంకటాపూర్‌ను ఆదుకుంటాం | mla sudhir reddy visits venkatapur | Sakshi
Sakshi News home page

వెంకటాపూర్‌ను ఆదుకుంటాం

Published Mon, Jan 12 2015 9:20 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

mla sudhir reddy visits venkatapur

చుట్టూ గడ్డి భూములు.. కనువిందు చేసే పచ్చని పంట పొలాలు.. కోనసీమ అందాలను తలపింపజేసే రమణీయ దృశ్యాలు.. ఇవీ ఘట్‌కేసర్ మండలంలోని వెంకటాపూర్ పరిసరాలు.. ఈ గ్రామం హైదరాబాద్ మహా నగరానికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. మూసీ మురుగు, దోమల బెడద, కాలుష్యమయమైన భూగర్భ జలాలు, తాగునీటి ఎద్దడి, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తదితర సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి వెంకటాపూర్‌లో పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తానని  ప్రజలకు హామీ ఇచ్చారు.
 
 ఎమ్మెల్యే: పెద్దమ్మ పింఛన్ వస్తోందా..?
 అనసూయమ్మ: వస్తోంది సారు. మొన్న మూడు నెలల పింఛన్ ఇచ్చిన్రు. ఈనెల ఇంకా ఈయలేద్సారు.
 ఎమ్మెల్యే: ఈనెల పింఛన్లు కూడా త్వరలోనే వస్తాయి. ఇంకా ఎవరికైనా పింఛన్లు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోండి. అధికారులు పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తారు.
 ఎమ్మెల్యే: పెదమ్మా రేషన్ వస్తోందా..?.
 రత్నమ్మ: కొత్త రేషన్ కార్డులు ఇంకా ఇయ్యలే సారు.
 ఎమ్మెల్యే: రేషన్ కార్డులు మన కొత్త సర్కారొళ్లు త్వరగానే ఇస్తరు. మునుపటి లెక్క ఒక్కరికి నాలుగు కిలోల బియ్యం కాదు.. ఆరు కిలోల బియ్యం ఇస్తున్రు. అందరూ కడుపు నిండా బువ్వ తినాలని సర్కార్ ఆలోచిస్తోంది.
 
 రత్నమ్మ: మంచిది సారు.
 లక్ష్మమ్మ: రేషన్ సరుకులు సరిగా ఇస్తలేడు సారు.
 అక్కడే ఉన్న రేషన్ డీలర్ బాలరాజ్‌ను ఎమ్మెల్యే పిలిచారు.
 ఎమ్మెల్యే: ఆ ముసలామెకు రేషన్ బియ్యం ఇయ్యి. రేషన్ దుకాణాల్లో ఏం చేస్తారో అవన్నీ నాకు తెలుసు. బియ్యం వస్తలేవని మళ్లీ ఆమె నా వద్దకు రావద్దు.
 ఎమ్మెల్యే: పెద్దమ్మా బాగున్నవా. ఏమైనా సమస్యలున్నాయా..?
 కట్ట రాములమ్మ: ఉన్నయి సారు. నా మనుమనికి తల్లి, తండ్రి లేరు. నేనే సాదుతున్న. వాడి మానసిక పరిస్థితి సక్కగ లేదు. వికలాంగుల పింఛన్ ఇప్పించండ్రి .
 ఎమ్మెల్యే:సదరమ్ కార్డు ఉంటే వికలాంగుల పింఛన్ వస్తది. పట్నంల వనస్థలిపురం దవాఖానకు నీ మనుమణ్ని తీసుకెళ్లు. అక్కడ డాక్టర్లు పరీక్షించి సదరన్ కార్డు ఇస్తరు. అప్పుడు దరఖాస్తు చేసుకో. పింఛన్ వస్తది.
 ఎమ్మెల్యే: అమ్మ.. ఇక్కడ  ఎమైన సమస్యలున్నాయా..?
 
 సుధా (అంగన్‌వాడీ కార్యకర్త): సారు మా అంగన్‌వాడీలో నల్లా కనెక్షన్ లేదు. దీంతో నీటికి ఇబ్బంది పడుతున్నం. భోజనం వండటానికి ఇబ్బందిగా ఉంది.
 
 ఎమ్మెల్యే: మీ అంగన్ వాడి కేంద్రానికి వెంటనే నల్లా కనెక్షన్ ఇప్పిస్తానమ్మ అంటూ అక్కడే ఉన్న సర్పంచ్ కృష్ణవేణికి వెంటనే నల్లా కనెక్షన్ ఇయ్యవలసిందిగా ఆదేశించారు.
 శారద: మాకు డ్వాక్రా బిల్డింగ్ లేదు. దీంతో ఆడోళ్లు మీటింగ్‌లు పెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నం. గతంలో గ్రామ పంచాయతీ వారుకొత్త గ్రామ పంచాయతీ భవనంలో పోయినంక, పాత భవనాన్ని ఇస్తామన్నారు. వారు కొత్త దాన్ల పోయిన్రు. పాతది మాత్రం ఇస్తలేరు.
 ఎమ్మెల్యే: (అక్కడే ఉన్న  మాజీ సర్పంచ్ బాలరాజ్‌తో) పాత పంచాయతీ భవనాన్ని  డ్వాక్రా మహిళలకు ఇచ్చేందుకు తీర్మానం చేసిన్రా.
 
 బాలరాజు(మాజీ సర్పంచ్): చేసిన్రు. సారు.
 
 ఎమ్మెల్యే: తీర్మానం చేసినంక ఇంకా ఎందుకు ఇస్తలేరు. వెంటనే ఇచ్చేయున్రి. పాత పంచాయతీ భవనానికి బాత్రూమ్‌లు కట్టించి, నీటి వసతి, కరెంటు సౌకర్యం కల్పించి, సున్నం వేసి డ్వాక్రా మహిళలకు ఇయ్యున్రి. 10 రోజుల్లో నేనే ఒచ్చి కొబ్బరికాయ కొట్టి ఆడోళ్లకు అందజేస్త.
 దానయ్య: నాకు పింఛన్  ఇయ్యరంట సారు.
 ఎమ్మెల్యే: నువ్వు ఎన్ని ఏండ్లు ఉన్నయ్..?
 
 దానయ్య: అరవై ఉంటాయి సార్.
 
 ఎమ్మెల్యే: సర్కార్ 65 ఏండ్ల కంటే మీదున్నొళ్లకు పింఛన్ ఇయ్యలనే నిబంధన పెట్టింది. మనం గూడ సర్కార్‌ను అర్థం చేసుకోవాలే. ఆ వయస్సులో కాళ్లు రెక్కలు పనిచేయ్యయి. అప్పుడు సర్కార్ ఇచ్చే పింఛన్ ఆసరా అయితదని ఆలోచిస్తుంది. మనం జెర అర్థం చేసుకోవలే.
 ఎమ్మెల్యే: (రైతులను) ఏమైనా సమస్యలున్నాయా..?
 పెంటయ్య: బావుల కాడ కరెంటు సరిగా వస్తలేదు. సారు. ఎక్కువ సేపు వస్తే బాగుండు.
 ఎమ్మెల్యే: మనకాన్నె కరెంటు బాగుంది. వేరే దగ్గరైతే ఆయింత కరెంట్ కూడా వస్తలేదు.
 భూమయ్య: బడిలో వంటగది లేక ఇబ్బందుల పడుతున్రు.
 ఎమ్మెల్యే:మీ ఊరోళ్లు స్థలం సూపిస్తే వంట గది కట్టిద్దాం.
 ఎమ్మెల్యే: రైతన్న ఏమైనా సమస్యలున్నాయ..?
 
 అండె పోచయ్య(నాగలి దున్నతున్న రైతు): యాసంగీలో నెల్లూరి సోన సాగుచేస్తున్న. ఎకరానికి 20 నుంచి 30 బస్తాలు ధాన్యం పండుతుంది. 6 నుంచి 7 వేల లాభాలుస్తున్నయ్. కష్టానికి తగ్గ లాభాలు వస్తలేవు.
 
 ఎమ్మెల్యే: ప్రతాపసింగారం, ఏదులాబాద్‌లో ధాన్యం కొనే కేంద్రాలు ఏర్పాటు చేసినం. ఆడికి వచ్చి ఒడ్లు అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. ఈసారన్న సర్కారోళ్లకు ఒడ్లు అమ్ము.
 పోచయ్య: సరే సారు.
 
 ఎమ్మెల్యే: ఏమమ్మ ఏమైనా సమస్యలున్నాయా..? కూలీ ఎంత ఇస్తున్రు.
 అంజమ్మ, నీరుడు సబిత(నాట్లు వేసే మహిళలు): పొద్దగాళ్లొస్తే రోజుకు రూ.250 కూలీ ఇస్తున్రు. కొంచెం అమ్మటాళ్లకు వస్తే రూ.200 కూలీ ఇస్తున్రు. సారు.
 రామారావు: గుడిని బాగు చేయాలె సారు.
 ఎమ్మెల్యే: దాతలు, సర్కార్ సహాయంతో గుడిని బాగు చేద్దాం.
 మంగమ్మ: సారు నాకు పింఛన్ వస్తలేదు. ఇంతకు మందు నాకు, మా ఆయనకూ పింఛన్ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు.
 
 ఎమ్మెల్యే: భార్యాభర్త ఇద్దరూ ముసలొళ్లు అయితే ఒక్కరికే పింఛన్ ఇయ్యాలనేది గవర్నమెంట్ నిర్ణయం. దాని ప్రకారం ఒక్కరికి పింఛన్ వస్తదమ్మ.
 
 నాగయ్య: సారు మాకు ఇల్లు లేదు. మేం ఇద్దరం ముసలివాళ్లం. కిరాయిఇ ంట్లో ఉంటున్నాం. మాకు ఎట్లైనా చేసి ఇళ్లు కట్టియ్యి సారు. నీ కాళ్లు మొక్కుతా.
 
 ఎమ్మెల్యే:మీ ఊర్లో ఎక్కడైనా జాగా చూసి అధికారులకు చెప్పి ఇల్లు కట్టిస్తానమ్మా.
 లక్ష్మమ్మ:  నా పింఛన్ కొర్రెముల పక్క ఊర్లో ఇస్తున్రు. ప్రతి నెల ఆడికి పోవడం ఇబ్బందిగా ఉంది.
 ఎమ్మెల్యే: అధికారులకు చెప్పి నీపింఛన్ ఇక్కడనే వెంకటపూర్లో ఇచ్చేలా చూస్తా.
 నర్సమ్మ: గ్రామానికి కృష్ణనీరు సరిగా రావడం లేదు.
 
 ఎమ్మెల్యే: సరిగా వచ్చేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానమ్మ.
 కృష్ణవేణి: కొన్ని చోట్ల సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు సారు.
 ఎమ్మెల్యే: నిధులు కేటాయించి  సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటా.ఎక్కువ నిధులు కేటాయించి త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తా.
 
 
 దశలవారీగా పరిష్కరిస్తా
 
 ‘సాక్షి’ ద్వారా వెంకటాపూర్‌లో సమస్యలు తెలుసుకున్నాను. నేను నివాసం ఉండే ప్రతాప్‌సింగారం గ్రామానికి పక్కనే వెంకటాపూర్ ఉండటంతో ఈ సమస్యల్లో చాలా వరకు నాకు తెలుసు. దశల వారీగా సమస్యలను పరిష్కారిస్తా. రోడ్లు, అంగన్‌వాడీ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తాను. గ్రామానికి సింగిల్ రోడ్డు ఉంది. దానిని అభివృద్ధి చేస్తాను. అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం. గ్రామాల్లోని సమస్యలపై ప్రజల్లో చైతన్యం వచ్చి వాటిని పరిష్కరించాలని కోరే ధైర్యం చూపాలి. అప్పుడే అభివృద్ధి వేగంగా జరుగుతుంది.
 - మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement