ఉత్తరం ఇస్తే దక్షిణ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో పోలీసుల బదిలీల ప్రక్రియలో మనీ మస్ట్‌గా మారింది. స్టేషన్‌కో రేటు చొప్పున ఫిక్స్ చేసిన రాజకీయ నేతలు చేయి తడిపిన వారికే వంతపాడుతున్నారు.
దీంతో పైరవీ చేసిన వారికే ప్రాధాన్యమున్న పోస్టులు, అది చేతగాని వారికి వీఆర్‌లు, ప్రాధాన్యత లేని పోస్టులు దక్కుతున్నాయి. గతంలో నిబద్ధత, సామర్థ్యం, సీనియారిటీని బట్టి పోలీసు అధికారుల బదిలీలు ఉండేవి. ఇప్పుడా పద్ధతికి పూర్తిగా కాలం చెల్లిపోయింది. పోలీసు బదిలీలన్నీ ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు ‘కన్నుగీటి’తేనే వారి నియోజకవర్గాల పరిధిలోని పోలీసు స్టేషన్లలో పోస్టింగులు ఇస్తున్నారు. ప్రజా ప్రతినిధుల
‘ఉత్తరం’ లేనిదే పోస్టింగులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎస్‌ఐలు, సీఐలు... నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసి వారిని ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు.
ఒకరికి తెలియకుండా మరొకరు, ఒకరి వెనుక ఇంకొకరు వరుసకట్టి తెల్లవారేసరికి పోలీసు అధికారులు తమ ఇంటి ముందు వాలిపోతుండటంతో... ప్రజా ప్రతినిధులు డిమాండ్‌ను బట్టి స్టేషన్‌కో రేటు ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సర్కిల్ పోలీసు స్టేషన్ నెలవారీ రాబడి ఆధారంగా రూ.5 నుంచి రూ. 10 లక్షల వరకు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పరిశ్రమలు ఎక్కువగా ఉండి, రియల్‌ఎస్టేట్ వ్యాపారం సాగుతున్న పటాన్‌చెరు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట నియోజకవర్గాల పరిధిలోని పోలీసు స్టేషన్లకు మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
పైకి అంతా సవ్యంగానే....
ప్రస్తుత అంచనా ప్రకారం జిల్లాలో దాదాపు 60 నుంచి 70 మంది ఎస్‌లు, 40 మంది వరకు సీఐలు, పలువురు డీఎస్పీల బదిలీలు జరుగనున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, రేంజ్‌ల పరిధిలో ఈ బదిలీలు జరుగుతాయి. నిబంధనల ప్రకారం హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, నిజామాబాద్ రేంజ్ డీఐజీ జె.సూర్యనారాయణ స్థాయిలో ఎస్‌ఐల బదిలీలు నిర్వహిస్తారు.
ఎస్పీ సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీఐల బదిలీల ప్రక్రియ చేపడుతుంది. పైకి చూడటానికి ఈ బదిలీల ప్రక్రియ అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపిస్తన్నప్పటికీ తెర వెనుక తతంగం వేరే నడుస్తోంది. నియోజకవర్గాల్లో అనుకూలమైన పోలీసులు ఉండటం ఆయా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు అత్యంత ముఖ్యం కావడంతో వా రు ముఖ్యమంత్రితో పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారు.
చేయితడుపుతాం..సాయం చేయండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో పోలీసు అధికారుల బదిలీ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. జిల్లాల్లో 8 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. వారి నియోజకవర్గాల్లోనే భారీగా బదిలీలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కొంత మంది పోలీసు అధికారులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి, టీఆర్‌ఎస్ వాళ్లను ఇబ్బంది పెట్టారనే ఫిర్యాదులు ఉన్నాయి.
సంగారెడ్డి పట్టణంలో ఒక పోలీసు అధికారి, జోగిపేట నియోజకవర్గంలో మరో అధికారి, నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో ఇంకొందరు పోలీసులు ఇలా... వీరందరికీ ఇప్పుడు బదిలీ తప్పదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఖాళీ అయిన స్టేషన్లలో తమకు పోస్టింగులు ఇవ్వాలని పోలీసు అధికారులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కోరుకున్న చోటికి సిఫార్సు చేస్తూ ‘ఉత్తరం’ ఇస్తే... ‘దక్షిణ’ చెల్లించుకోవడంతో పాటు నియోజకవర్గంలోని సదరు నేత వర్గానికి అండగా నిలబడతామని వారు ప్రమాణాలు చేస్తున్నట్లు సమాచారం.
నిజాయతీపరులు ‘రోడ’్ల మీదకే.
పైరవీలు చేసుకోకుండా.. కర్తవ్యం..డ్యూటీ అంటూ ముందుకుసాగే అధికారులు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు దక్కుతాయనే ప్రచారం పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి త్వరలో జరగబోయే బదిలీల్లో పారదర్శకత పాటించడంతో పాటు, సామర్థ్యం, నిబద్ధత కలిగిన అధికారులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.