సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల నుంచి మనుషులకు కొత్త వ్యాధులు, వైరస్‌లు సోకే ప్రమాదం గతంలోకంటే ఎన్నో రెట్లు పెరిగిందని, ఈ సమస్యపై సత్వరం అవసరమైన జాగ్రత్తలు చేపట్టకపోతే భవిష్యత్‌లో తీవ్ర నష్టం తప్పదని ‘కోవిడ్–19: అర్జంట్ కాల్ టు ప్రొటెక్ట్ పీపుల్ అండ్ నేచర్’తాజా నివేదికలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇంటర్నేషనల్ వెల్లడించింది. ‘వైరస్‌లతో ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, భద్రతకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని, వన్యప్రాణులకు నష్టం చేయడాన్ని తక్షణం ఆపకపోతే భవిష్యత్‌లో మరిన్ని ప్రాణాంతక, ప్రమాదకరమైన వ్యాధులు, వైరస్‌లు వ్యాప్తి చెంది మానవాళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.
1990 దశకం నుంచి మనుషుల్లో బయటపడిన 60–70 శాతం కొత్త వ్యాధులు వన్యప్రాణుల నుంచే వచ్చాయి. ఇదే కాలంలో ›ప్రపంచవ్యాప్తంగా 178 మిలియన్ హెక్టార్ల అడవి కనుమరుగైపోయింది. దీనిని బట్టి ఈ రెండింటి మధ్య సంబంధాలు ఏమిటనేది స్పష్టమవుతోంది’అని నివేదికలో ప్రచురించారు. ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు, వైరస్‌లు–చేపట్టాల్సిన కార్యాచరణపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.
ఆర్థికాభివృద్ధి–పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యం
‘ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధి–పర్యావరణ పరిరక్షణ రెండింటికి తప్పనిసరిగా సమాన ప్రాధాన్యతనివ్వాలి. జంతువుల నుంచి సోకే వ్యాధులు, వ్యాపించే వైరస్‌ల పట్ల భారత్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వన్యప్రాణులు, జంతువుల్లో అనేక రకాల వైరస్‌లున్నాయని, వాటి నుంచే మనుషులకు ఆయా వైరస్‌లు, వ్యాధులు సోకుతున్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్‌లు జంతువుల శరీరంలోనే ఉంటే నష్టం లేదు. కానీ వన్యప్రాణులు, జంతువులను చంపి వాటి ఆహారాన్ని తినడం, అవి ఉంటున్న ప్రాంతాల్లోకి వెళ్లడం ద్వారా వివిధ రకాల వైరస్‌లు మనుషులకు సోకే అవకాశాలు పెరిగాయి. వన్యప్రాణులకు మనుషులు ఆహారం పెట్టడం మానుకోవాలి. అవి సొంతంగా ఆహారం సంపాదించుకోగలుగుతాయి. హైదరాబాద్‌లో పెద్దమొత్తంలో పావురాలకు గింజలు దాణాగా వేయడం వల్ల వాటి జనాభా గణనీయంగా పెరిగిపోయి నగరవాసుల్లో శ్వాసకోశ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి’
–డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్
జీవ వైవిధ్యమే కీలకం
‘మనుషులు, ప్రకృతి, పర్యావరణం ఒకదానికి ఒకటి సహకరించుకుంటేనే రాబోయే రోజుల్లో తీవ్రమైన సమస్యల బారిన పడకుండా రక్షించుకోగలుగుతాం. ఏ జంతువు శరీరతత్వం ఏమిటి? దాని మాంసం తినొచ్చా లేదా అన్నది తెలుసుకోకుండానే విచక్షణా రహితంగా అన్నింటినీ తినడం ఏమాత్రం మంచిది కాదు. వన్యప్రాణుల నుంచి మనుషులకు వ్యాధులు వ్యాప్తి చెందడం చాలా ప్రమాదకరం. కోవిడ్ వ్యాప్తి ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. అందువల్ల ఆహార అలవాట్లను మార్చుకుని సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముంది. ఒక చెట్టు, జంతువు లేదా పక్షి జాతి అంతరిస్తే దాని ప్రభావం చుట్టుపక్కల ఉన్న జాతులపైనా పడుతుంది. ఈ అంశాలన్నింటినీ గ్రహించి పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు ముందుకు కదలాలి’ – వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్
Comments
Please login to add a commentAdd a comment