ఎంటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి | mtech student suspicious death | Sakshi
Sakshi News home page

ఎంటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి

Published Tue, Jan 27 2015 6:21 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

mtech student suspicious death

రంగారెడ్డిజిల్లా (కీసర): ఓ ఎంటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. హత్యే అని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు కీసర ఠాణా వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండల పరిధిలోని యాద్గార్‌పల్లి బైపాస్ రహదారి కల్వర్టు వద్ద మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ మండలం బండరావిర్యాల గ్రామానికి చెందిన గోద రాములు, అమృత దంపతుల కుమారుడు మధుయాదవ్(25) స్థానికంగా బాటసింగారంలోని ఓ కాలేజీలో ఎంటెక్ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం కీసర మండలం నాగారంలోని స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన అతడు తన పల్సర్ బైక్‌పై బయలుదేరాడు. ఇదిలా ఉండగా, మంగళవారం తెల్లవారుజామున కీసర యాద్గార్‌పల్లి బైపాస్ రహదారి (ఓఆర్‌ఆర్ జంక్షన్ సమీపం)లోని కల్వర్టులో మధుయాదవ్ విగ తజీవిగా పడి ఉన్నాడు. ఘటనా స్థలంలో అతడి బైక్ పడి ఉంది. వాహనదారుల సమాచారంతో కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతుడి కుటుంబీకులు పీఎస్ వద్దకు చేరుకున్నారు.

మధుయాదవ్‌ను అతడి స్నేహితులు పథకం ప్రకారం హత్య చేసి బైక్ తీసుకొచ్చి పడేసి ప్రమాద ఘటనగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగారం గ్రామంలో నివాసం ఉండే మధుయాదవ్ స్నేహితుల్లో ఒకరికి ఇటీవలే విదేశాలకు వెళ్లేందుకు వీసా రావడంతో సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారని, ఈక్రమంలో పథకం ప్రకారం హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు గోద రాములు, అమృత ఆరోపించారు. తమ కుమారుడి ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని, అతడు చివరిక్షణం వరకు దుండగుల నుంచి తప్పించుకునేందుకు యత్నించాడని తెలిపారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో మధుయాదవ్ రెండుసార్లు ఇంటికి రెండుసార్లు కాల్ చేశాడని తెలిపారు. ఘటనా స్థలానికి క్లూస్‌టీం, జాగిలాలను ఎందుకు రప్పించలేదని పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఎస్‌ఐలు వెంకట్‌రెడ్డి, అనంతచారిలు ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, హత్య అయితే దుండగులను వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు శాంతించారు. ఇప్పటికే మధుయాదవ్ స్నేహితులు ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని సీఐ గురువారెడ్డి పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మధుయాదవ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement