
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఖమ్మం మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వర్‌రావు టీడీపీని వీడారు. పొలిట్‌బ్యూరో సభ్యత్వంతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నానని, పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు అనేక ఇబ్బందులకు ఓర్చి కష్టపడ్డా తెలంగాణ గడ్డపై టీడీపీ మనుగడ సాగించే అవకాశాలు లేవని లేఖలో పేర్కొన్నా రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానన్నారు.
2004లో టీడీపీలో చేరి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన నామా... కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో మరోసారి ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. 2009 నుంచి 2014 వరకు ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన నామా... టీడీపీకి గుడ్‌బై చెబుతారని అప్పటి నుంచే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఒక దశలో కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయించుకున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నామాతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య సైతం టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment