సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్ విసిరిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ వలకు నల్లగొండ జిల్లాలో ఓ చేప చిక్కింది. శాసనసభకు గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి విజయం సాధించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరనున్నారు. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఆయన ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. చిరుమర్తి లింగయ్య శనివారం హైదరాబాద్‌లో తాను పార్టీ మారతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆయన చేరికకు సంబంధించి ఇప్పటికే లాంఛనాలన్నీ పూర్తయ్యాయని, సీఎం కేసీఆర్‌తో ప్రత్యేక భేటీ కూడా ముగిసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లో విజయం సాధించింది. భువనగిరి లోక్‌సభస్థానం పరిధిలోని మునుగోడు, నకిరేకల్, నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని హుజూర్‌నగర్‌లో ఆ పార్టీ గెలిచింది. రేపో మాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్న తరుణంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీని వీడనుండడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం లింగయ్యతో కలిసి పనిచేస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి చేతులు కలుస్తాయా అన్నది ప్రశ్నార్థకమే అని అభిప్రాయం పడుతున్నారు.
తెర వెనుక ఏం జరిగింది?
ముందుస్తు ఎన్నికల ఫలితాలు వెలువడి, టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే కొందరు కాంగ్రెస్ నాయకులు పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. ఇందులో కోమటిరెడ్డి సోదరుల పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి. కానీ, వారు ఈ ప్రచారాన్ని ఖండిం చారు. వారి వెంటే ఉండే చిరుమర్తి లింగయ్య గురించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రచారం జరగలేదు. మరోవైపు కోమటిరెడ్డి సోదరులను పార్టీలోకి తీసుకోవద్దని, లింగయ్యను తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు అధినేత కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో స్థానానికి కాంగ్రెస్ నల్లగొండ ఉమ్మడి జిల్లాకు చెందిన టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిని అభ్యర్ధిగా బరిలో పెట్టింది. ఐదో స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు వ్యూహం రచించిన టీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గాలం వేసిందంటున్నారు. దీనిలో భాగంగానే, చిరుమర్తి లింగయ్యను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి అధినేత కేసీఆర్ అప్పజెప్పారని తెలుస్తోంది.
అన్నీ తామైన ‘కోమటిరెడ్డి’ సోదరులకు ఝలక్
వాస్తవానికి చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి సోదరులు గీసిన గీత దాటరని ఓ అభిప్రాయం బలంగా ఉంది. కానీ, తాజా పరిణామాలు కోమటిరెడ్డి సోదరులకు లింగయ్య ఝలక్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నిక సమయంలో మహా కూటమి పొత్తుల్లో భాగంగా తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ స్థానం కేటాయిస్తున్నారన్న వార్త బయటకు వచ్చింది. టీ.పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ఢిల్లీలో ఈ ప్రకటన చేయడంతో కోమటిరెడ్డి సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లింగయ్యకు నకిరేకల్ టికెట్ ఇవ్వకుంటే తాను నల్లగొండ నుంచి పోటీ కూడా చేయనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. లింగయ్యకు మద్దతుగా నార్కట్‌పల్లిలో నిర్వహించిన ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత పరిణామాల్లో లింగయ్యకే నకిరేకల్ టికెట్ దక్కడం, ఆ ఎన్నికల్ల ఆయన గెలవడం వరుసగా జరిగిపోయాయి. తమ వెంటే ఉంటాడనుకున్న లింగయ్య తమను వీడి గులాబీ గూటికి చేరనుండడాన్ని కోమటిరెడ్డి సోదరులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో...
ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కాకుండా.. ప్రధానంగా ఎంపీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్ నాయకత్వం వ్యూహ రచన చేసిందంటున్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మెజారిటీ రాలేదు. దీంతో ఏడు సెగ్మెంట్లలో నాలుగు చోట్లా బలహీనంగా కనిపిస్తోంది. పదహారు ఎంపీ స్థానాలపై కన్నేసిన టీఆర్‌ఎస్ ఈ విషయాన్ని తీవ్రంగానే తీసుకుందంటున్నారు. ఫలితంగా నకిరేకల్ ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానించిందని విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment