ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కు తగ్గం
జేఏసీ ,తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ,నల్లగొండ
నిబద్ధతతో నిలబడతాం.. నిజాయితీతో పనిచేస్తాం: కోదండరాం
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశలో జేఏసీగా భవిష్యత్‌లో మరింత క్రియాశీలకం అవుతామని, ఈ క్రమంలో ఎన్ని ఒత్తిడులు, విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గేది లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువలను నిర్మించడమే లక్ష్యంగా ముందుకెళతామని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా జేఏసీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు గురువారం నల్లగొండకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జేఏసీగా ఇప్పటికే పలు కొత్త జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని, త్వరలోనే అన్ని జిల్లాల కమిటీలను పూర్తి చేసుకుంటామని చెప్పారు.
ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళతామని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రైతు జేఏసీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరెన్ని మాటలు అన్నా వెనక్కు తగ్గేది లేదని.. సద్విమర్శలను స్వీకరిస్తామని, నిబద్ధతతో నిలబడి నిజాయితీగా పనిచేస్తామని కోదండరాం పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలతోనే అంతా అరుుపోదని, అది కేవలం ఒక అంశం మాత్రమేనని, పౌరపాత్రను ఎన్నికల వరకే కుదించడానికి వీల్లేదని అంబేడ్కర్ పదే పదే చెప్పారని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్‌లో మరింత బాధ్యతాయుతంగా, క్రియాశీలకంగా పనిచేస్తామన్నారు.