సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) దరఖాస్తు గడువును ఈ నెల 6 వరకు పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఆరోజు రాత్రి 11.50 గంటల వరకు తెరిచి ఉంచుతామని పేర్కొంది. వాస్తవంగా 2020–21కు సంబంధించి నీట్ పరీక్ష కోసం గత నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు. తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ దరఖా స్తులు చేయనివారు ఇప్పుడు సమర్పించవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. అయితే పరీక్షా షెడ్యూల్‌లో ఏ మార్పులూ ఉండవని తెలిపింది. విద్యార్థులు తమ దరఖాస్తు ఫారాలను ఈ నెల 15 నుంచి 31 వరకు సవరించుకోవచ్చు. నీట్ పరీక్ష మే నెల 3న నిర్వహిస్తారు. అనంతరం జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు. ఇంగ్లీష్, హిందీతో సహా 11 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఈసారి ఎయిమ్స్, జిప్‌మర్ ఎంబీబీఎస్ కోర్సులలో ప్రవేశానికి కూడా నీట్ పరీక్ష రాయాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా 2,546 పరీక్షా కేంద్రాలు
దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలోనూ పరీక్ష ఉంటుంది. గతేడాది తెలంగాణ నుంచి 48,996 విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 33,044 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదేస్థాయిలో విద్యార్థులు నీట్ పరీక్ష రాసే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment