కొత్త జిల్లాలకు అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించే ప్రక్రియ దాదాపు అన్ని విభాగాల్లో పూర్తయింది.
11న ఉత్తర్వులు జారీ!
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించే ప్రక్రియ దాదాపు అన్ని విభాగాల్లో పూర్తయింది. ఏయే జిల్లాల్లో ఏ కేడర్‌లో ఎవరెవరిని నియమించవచ్చన్న వివరాలు తెలుపుతూ ఆయా విభాగాల అధిపతులు సాధారణ పరిపాలన శాఖకు ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనల మేరకే ఉద్యోగుల నియామకాలకు ప్రభుత్వం యథాతథంగా ఆమోదం తెలుపుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
కొత్త జిల్లాల్లో కొత్త పోస్టింగులు ఎవరెవరికి దక్కనున్నాయోనన్న విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులు, అధికారులకు తెలియజేసినట్లు పంచాయతీరాజ్, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నెల 11న కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నందున, నియామక ఉత్తర్వులు కూడా అదే రోజున జారీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. అన్ని శాఖల్లోనూ ఈ ప్రక్రియ పూర్తయినప్పటికీ రెవెన్యూశాఖలో పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లు తమకు ఎటువంటి సమాచారం అందలేదంటూ సచివాలయం చుట్టూ ప్రద క్షిణలు చేస్తున్నారు.