33 రోజులు.. 17 వేల దరఖాస్తులు | new target is assigned to electrical dept for employees | Sakshi
Sakshi News home page

33 రోజులు.. 17 వేల దరఖాస్తులు

Published Mon, Feb 27 2017 5:13 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

new target is assigned to electrical dept for employees

► వ్యవసాయ కనెక్షన్ల మంజూరుకు విద్యుత్‌ శాఖ లక్ష్యం 
► కొత్త పథకాలతో సిబ్బందిపై పెరుగుతున్న ఒత్తిడి
► గడువులోగా పూర్తిచేస్తామంటున్న యంత్రాంగం
మహబూబ్‌నగర్‌ (భగీరథకాలనీ) : మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు నత్తనడకన సాగుతుంది. గతేడాది అక్టోబర్‌ నాటికి పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను ఈ ఏడాది మార్చి నాటికి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. దీంతో ఇప్పటి వరకు 27,440 పెండింగ్‌ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను విడుదల చేసేందుకు విద్యుత్‌శాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా అమలులో మాత్రం నిర్లక్ష్యపు ఛాయలు అలుముకున్నాయి. 5 నెలల్లో 27,440 పెండింగ్‌ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను విడుదల చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకోగా నాలుగు నెలలు గడుస్తున్నా ఈ నెల 9వ తేదీ నాటికి కేవలం 8,741 కనెక్షన్లకు మాత్రమే  మోక్షం కలిగించారు. మరో 18,699 కనెక్షన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈనెలఖారులోగా మరో 1,699 కనెక్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మిగిలిన 17 వేల కనెక్షన్లు విడుదల చేసేందుకు అధికారులు ఇంకెంత సమయం తీసుకుంటారో మరి.
 
 
నత్తనడకన కనెక్షన్ల మంజూరు..: మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో 5 విద్యుత్‌ శాఖ డివిజన్లు మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, గద్వాల ఉన్నాయి. వీటి పరిధిలో గతేడాది అక్టోబర్‌ నాటికి 27,440 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. కాగా వాటిని గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి చివరి వరకు పరిష్కరించేందుకు అధికారులు నెలవారీగా లక్ష్యాలను నిర్ధేశించుకుని ప్రణాళిక రూపొందించారు. అయితే ఈ లక్ష్యాలకు.. క్షేత్రస్థాయిలో విడుదలవుతున్న కనెక్షన్లకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. నిర్దేశించుకున్న లక్ష్యాలలో సగం కూడా కనెక్షన్లను విడుదల చేయలేకపోయారు. వీటికితోడు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నాటికి మరో 4,456 కొత్త దరఖాస్తులు వచ్చాయి. ఇలా మొత్తం 31,896 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో 8,741 మాత్రమే కనెక్షన్లు విడుదల చేయగలిగారు. మరో 23,155 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
 
అన్నింటినీ పరిష్కరిస్తాం..: పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను గడువులోగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. మే చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతోపాటు అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ  పరిష్కరిస్తాం. బోర్లు లేకున్నా, బోర్లలో నీరు లేకున్నా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ సామగ్రిని పొందేందుకు ఎక్కువ డీడీలు చెల్లించి దరఖాస్తు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటిపై క్షేత్రస్థాయి విచారణ జరిపి తప్పుడు దరఖాస్తులను తొలగిస్తాం.– రాముడు, ఎస్‌ఈ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement