వచ్చే ఏడాది నుంచి 9గంటల విద్యుత్తు | Next year for the agriculture free eletricity | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది నుంచి 9గంటల విద్యుత్తు

Published Tue, May 12 2015 4:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వచ్చేయేడాది నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నిరంతరంగా ఉచిత విద్యుత్తును అందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు...

- నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
మెదక్ రూరల్:
వచ్చేయేడాది నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నిరంతరంగా ఉచిత విద్యుత్తును అందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మెదక్ మండల పరిధిలోని ఖాజిపల్లి, పిల్లికొటాల్, ఫరీద్‌పూర్,   గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, హవేళిఘణపూర్‌లో సబ్‌స్టేషన్  నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు.

కేవలం రెండు నెలల్లోనే నియోజకవర్గంలో 8 సబ్‌స్టేషన్లు మంజూరు చేశామన్నారు. అలాగే జిల్లాలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు సింగూరు, దాని పరిధిలోని మహబూబ్‌నహర్ (ఎంఎన్) కెనాల్ ఫతేనహర్ (ఎఫ్‌ఎం)కెనాళ్ల సిమెంట్ లైనింగ్ కోసం రూ. 70 కోట్లు మంజూరు చేశామన్నారు. డిప్యూటీ స్పీకర్ కోరిక మేరకు ఇటీవలే మరో రూ.22 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే ప్రాజెక్టు ఎత్తుపెంపు తదితర అవసరాల నిమిత్తం మరో రూ.30 కోట్లు విడుదల చేశామన్నారు.

గతంలో పింఛన్ల కోసం ప్రభుత్వం మెదక్  జిల్లాలో నెలకు   రూ. 81 లక్షలు ఖర్చుపెడితే ప్రస్తుతం నెలకు రూ.4.83 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. అప్పట్లో జిల్లాలో 34వేల పింఛన్లు ఉండగా నేడు 48 వేల పింఛన్లు ఇస్తున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం సీఎం పంచాయతీల అభివృద్ధికోసం  ఒక్కో పంచాయతీకి రూ.15 లక్షలు మంజూరు చేశారని, వాటితో మురికి కాల్వలు, సీసీ రోడ్లు నిర్మాణం, తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్య, ఎంపీపీ లక్ష్మి, నాయకులు అంజాగౌడ్, విశ్వం, కిష్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి, నర్సారెడ్డి, సునిత తదితరులు పాల్గొన్నారు.

ప్రాణహిత చేవెళ్లతో మెదక్ సస్యశ్యామలం
చిన్నశంకరంపేట: ప్రాణహిత చేవెళ్ల ద్వారా మెదక్ నియోజకవర్గాన్ని సస్యశామలం చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం చిన్నశంకరంపేటలోని ఐకేపీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి  శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గజ్వేల్ నియోజవర్గంలోని పాములపర్తి రిజర్వాయర్ ద్వారా చిన్నశంకరంపేట, రామాయంపేట, మెదక్ మండలలకు సాగునీరందించనున్నట్లు తెలిపారు.

గ్రామ సర్పంచ్ కుమార్‌గౌడ్ కోరిక మేరకు గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.15లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే చేగుంట-మెదక్ రోడ్ అభివృద్ధికి రూ. 16 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. చిన్నశంకరంపేటలో త్వరలో 132 కేవీ  సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం  కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో నియోజకవర్గన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

చెరువులు చూసి పిల్లను ఇవ్వాలి
శివ్వంపేట: గ్రామంలోని చెరువును చూసి ఆ ఊరికి ఆడపిల్లలను ఇవ్వాలని మంత్రి  హరీశ్‌రావు అన్నారు. గ్లాండ్ ఫార్మా కళాశాల చైర్మన్ పీవీఎన్‌రాజు విరాళంగా ఇచ్చిన రూ. 50లక్షలతో అల్లీపూర్, కొత్తపేట చెరువు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అల్లీపూర్‌కు వచ్చిన మంత్రికి గ్రామస్తులు బోనాలు,  పీర్ల ఊరేగింపుతో ఎడ్లబండిపై ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  ఇప్పటి వరకు రాష్ట్రంలో 6వేల చెరువుల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు.  పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గానికి 10 వేలు గ్యాస్‌కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.  నియోజకవర్గంలో 10వేల మెట్రిక్ టన్నుల గోదాంకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.  అనంతరం అల్లీపూర్ చెరువులో మత్స్యకారులు చేపలు పట్టడాన్ని చూసి మంత్రి హరీశ్‌రావు  వారితో మాట్లాడారు. అనంతరం వలను చెరువులోకి వేశారు.   కార్యక్రమంలో  ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, గ్లాండ్‌ఫార్మా చైర్మన్ పీవీఎన్‌రాజు,  జేసీ వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement