ఇంకా విడుదల కాని గైడ్ లైన్స్
ఎటూతేల్చని తెలంగాణ ప్రభుత్వం
సమీపిస్తున్న పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకంపై సర్కార్ ఎటూ తేల్చకపోవడంతో దాదాపు 16 లక్షల మందికి పైగా విద్యార్థులు(ట్యూషన్ ఫీజు, స్కాలర్‌షిపై చదివేవారు) త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు. పాతవారి రెన్యువల్స్‌కు కూడా అవకాశం కల్పించలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంతరవకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో పథకంపై ఆశలు పెట్టుకుని కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. మరో మూడునాలుగు నెలల్లో వార్షిక పరీక్షలు జరగనుండడంతో యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో ట్యూషన్ ఫీజులను కూడా చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. చదువుపైనా సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు.
స్పష్టత వచ్చేదెప్పుడో?
ఫాస్ట్‌కు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాకపోవడం తల్లితండ్రులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్ట్‌లో 1956 స్థానికతపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై ప్రభుత్వ వివరణను కోర్టు కోరింది. అయితే ఫాస్ట్‌పై అధికారులతో కమిటీని వేశామని, ఆ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇక ఈ కేసు తదుపరి విచారణకు వచ్చినపుడు స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు ఎంతసమయం పడుతుందనేది ఎవరికీ తెలియదు.
రెన్యువల్స్‌వారేఎక్కువమంది..
తెలంగాణలో ప్రస్తుతం వివిధ కోర్సుల్లో ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు, స్కాలర్‌షిప్‌పై ఆధారపడి ఇంటర్, డిగ్రీ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్థులే 14.29 లక్షల మంది ఉన్నారు. ఇక ఈ సంవత్సరం వివిధ కోర్సుల్లో చేరిన వారు మరో లక్షన్నరకు పైగా ఉంటారు. ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న వారికి కూడా ఫీజు రెన్యూవల్స్‌కూ అవకాశం కల్పించకపోవడంతో వారిని యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. గత ఏడాది బకాయిలను కూడా సర్కార్ పూర్తిగా చెల్లించకపోవడంతో యాజమాన్యాల ఒత్తిడి అధికమైంది.
అప్పులు చేస్తూ, వడ్డీలు కడుతూ నిర్వహిస్తున్నాం
నిరుద్యోగులమైన మేము ఉపాధికోసం అప్పులు తెచ్చి కళాశాల ఏర్పాటు చేశాం. ప్రతీనెల రూ. నాలుగు లక్షలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాలేదు. దీంతో నిర్వహణ కష్టంగా మారింది. మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోంది.
- మహిపాల్‌రెడ్డి, కరస్పాండెంట్,శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల, హుజూరాబాద్
మమ్మల్నే చెల్లించమంటున్నారు
డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఫస్టియర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంతవరకు రాలేదు. యాజమాన్యాం ఫీజు చెల్లించాలని అడుగుతోంది. మాది నిరుపేద కుటుంబం. ఫీజు చెల్లించే పరిస్థితి లేదు.
- నరేశ్ నాయక్, నల్లగొండ
ఫీజు రాక.. అప్పు చేసి చెల్లించాం
తమకు ప్రభుత్వంపై నమ్మకం లేదని, ప్రభుత్వం ఇవ్వకపోతే మీరే చెల్లించాలని యాజమాన్యం మాతో ఒప్పంద పత్రం రాయించుకుంది. అది రాసిచ్చినా ఫీజు రాకపోవడంతో తరువాత ఒప్పుకోలేదు. దీంతో అప్పు చేసి ఫీజు చెల్లించాకే హాల్‌టికెట్ ఇచ్చారు. - మహిపాల్, ఆర్మూర్
గత ఏడాది ఫీజులే రాలేదు
కరవు పరిస్థితుల్లో మేము ఫీజులు చెల్లించే పరిస్థితి లేదు. గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో ఫీజు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు.
- పి.శ్రావణి, మిర్యాలగూడ
‘ఫాస్ట్’ ఇంత జాప్యమా?
Published Wed, Dec 10 2014 2:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement
Advertisement