ఒక్క ప్రాజెక్టన్నా ఇచ్చారా? | No one railway project allocated for Telangana state in Railway budget, says KCR | Sakshi
Sakshi News home page

ఒక్క ప్రాజెక్టన్నా ఇచ్చారా?

Published Tue, Jan 20 2015 12:45 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

ఒక్క ప్రాజెక్టన్నా ఇచ్చారా? - Sakshi

ఒక్క ప్రాజెక్టన్నా ఇచ్చారా?

* ఉమ్మడిగా ఉన్నప్పుడు కొనసాగిన పంథానే ఇంకానా...
* సురేశ్‌ప్రభు ఎదుట సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో రైల్వే శాఖ చిన్నచూపు చూస్తోందని సీఎం కేసీఆర్ రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగినట్టుగానే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన సురేశ్‌ప్రభుతో తెలంగాణ రైల్వే డిమాండ్లపై కేసీఆర్ చర్చించారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క ప్రాజెక్టును కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కేటాయింపు అంశాన్ని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినా ఇప్పటి వరకు ప్రకటించలేదని, మంజూరు చేసిన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించటం లేదని ఫిర్యాదు చేశారు. చివరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు.
 
 ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలు, రైల్వేతో పేచీలకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను సురేశ్‌ప్రభుకు అందించారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై రైల్వేట్రాఫిక్ ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో నగర శివార్లలోని మౌలాలి, నాగులపల్లి స్టేషన్లను రైల్వే టెర్మినళ్లుగా మార్చాలని సురేశ్‌ప్రభును కేసీఆర్ కోరారు. సీఎం డిమాండ్లపై సాను కూలంగా స్పందించిన రైల్వే మంత్రి త్వరలోనే హైదరాబాద్‌లో పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.
 
 పెండింగ్ ప్రాజెక్టుల జాబితా
 - రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయడంతోపాటు కాజీపేటను డివిజన్‌గా ప్రకటించాలి. కాజీపేటకు మంజూరైన వాగన్‌వీల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే మొదలుపెట్టాలి.
 
 - పెద్దపల్లి-కరీంనగర్-జగిత్యాల-నిజామాబాద్ (178 కి.మీ.) లైనులో మిగిలిన పనిని వేగంగా పూర్తిచేయాలి. (భూసేకరణలాంటి పనులకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నిధులు డిపాజిట్ చేసింది)
 - మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టులో యాన్యుటీ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందున దాన్ని వెంటనే చేపట్టాలి.
 - అక్కన్నపేట-మెదక్ లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేసినందున దాన్ని వెంటనే చేపట్టాలి.
 - భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైనును సకాలంలో పూర్తిచేయాలి.
 
 - మంచిర్యాల-పెద్దంపేట ట్రిప్లింగ్ పనులు

 - కాజీపేట-విజయవాడ మూడో లైను ఎలక్ట్రిఫికేషన్
 - రాఘవాపూర్-మందమర్రి ట్రిప్లింగ్
 - మణుగూరు-రామగుండం కొత్త లైను
 - సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్
 - సికింద్రాబాద్-జహీరాబాద్ డబ్లింగ్
 - పగిడిపల్లి-శంకర్‌పల్లి సర్వే
 
 కొత్త ప్రతిపాదనలు:
 - గద్వాల-మాచెర్ల బ్రాడ్‌గేజ్ లైను
 - పాండురంగాపురం-భద్రాచలం లైను
 - వరంగల్‌లో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు
 - 15 ప్రాంతాల్లో కొత్తగా ఆర్‌ఓబీ/ఆర్‌యూబీల మంజూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement