లైట్‌ తీస్కో.. బాబూ లైట్‌ తీస్కో! | Non-Working Baggage Scanners at Secunderabad Railway Station | Sakshi
Sakshi News home page

లైట్‌ తీస్కో.. బాబూ లైట్‌ తీస్కో!

Published Thu, Aug 15 2019 2:27 AM | Last Updated on Thu, Aug 15 2019 2:58 AM

Non-Working Baggage Scanners at Secunderabad Railway Station - Sakshi

పై ఫోటోలో ఉన్న సీన్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మనం చాలాసార్లు చూసుంటాం.. లగేజీ స్కానర్‌ అక్కడే ఉంటుంది.. మనం మాత్రం లగేజీ స్కాన్‌ చేయించుకోకుండానే వెళ్లిపోతుంటాం. ఈ ఫొటోలోని వాళ్లలాగే.. అక్కడ ఉండే పోలీసులు కూడా స్కాన్‌ చేయించుకోవాలని ప్రయాణికులకు చెప్పరు..వాళ్ల ఫోన్లలో వారు బిజీ..

అండర్‌ వెహికిల్‌ స్కానర్‌.. మీకు తెలుసా? సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఇది కూడా ఉంది.. పార్కింగ్‌కు వచ్చే వాహనాలు అండర్‌ వెహికిల్‌ స్కానర్ల మీదుగా వచ్చే ఏర్పాటు చేశారు. కానీ స్కానర్లను పర్యవేక్షించేందుకు సిబ్బంది.. ఏర్పాటు చేయనే లేదు.. స్కానర్లు పనిచేస్తున్నా, వాహనాల దిగువన అనుమానిత వస్తువులు ఉన్నాయా లేదా అని పట్టించుకునేవాడే లేడు..    

ఇంతేనా.. డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు, హ్యాండ్‌ హెల్డ్‌ మెటల్‌ డిటెక్టర్లతో సిబ్బంది.. ఇలా చాలా ఉన్నాయి.. రోజూ 1.60 లక్షల మంది ప్రయాణికులు వచ్చే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో కనిపిస్తున్న భద్రత ఏర్పాట్లివీ.. అన్నీ ఆన్‌లోనే ఉంటాయి.. కానీ ఇవన్నీ చూడ్డానికే.. వాడ్డానికి కానట్లు తయారయ్యాయి. చాన్నాళ్లుగా ఇదే పరిస్థితి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో, ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా టెర్రర్‌ అటాక్‌ అలర్ట్‌ను కేంద్రం ప్రకటించింది.. అటు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద హై అలర్టు అమలులో ఉంది. ఇలాంటి కీలక తరుణంలో భద్రత విషయంలో రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించటం విశేషం. సికింద్రాబాద్‌ స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు మొత్తం ఆరు మార్గాలున్నాయి. కానీ 2 మార్గాల్లో మాత్రమే లగేజీ స్కానర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఆ రెండు మార్గాల్లోనే లోనికి వెళ్లేలా చేస్తే రద్దీ ఏర్పడి కీలక వేళల్లో తొక్కిసలాటకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో మరో రెండు చోట్ల లగేజీ స్కానర్లు ఏర్పాటు చేసి మిగతా మార్గాలను మూసేయాల్సి ఉంది. . కానీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement