సాక్షి, హైదరాబాద్: పోస్టల్ శాఖ సరికొత్త సేవలతో ముందుకు వస్తోంది. ఉత్తరాలు, పోస్టుకార్డులు చేరవేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న తపాలా శాఖ ఆధార్ సేవలూ అందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని జనరల్, హెడ్, సబ్ పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసిన తపాలా శాఖ తాజాగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఆధార్ నమోదు, చేర్పులు, మార్పుల సేవలు అవసరమున్నట్లు సమాచారం అందిస్తే చాలు.. డోర్ వద్దకు వచ్చి సేవలందించనుంది.
గత రెండున్నరేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తో ఒప్పందం కుదుర్చుకున్న పోస్టల్ శాఖ ఆధార్ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరిగా మారింది. ఇప్పటికే కొత్తగా పుట్టిన శిశువులు, చిన్నారులు మినహా దాదాపు ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ పేరు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు, సవరణలు, చిరునామాలు, మొబైల్ నెంబర్ల లింకేజీ, మార్పు కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు తీయక తప్పడం లేదు. దీంతో ఆధార్ కేంద్రాలకు డిమాండ్ పెరిగింది.
122 పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు
హైదరాబాద్‌లో జనరల్ పోస్టాఫీసు, హెడ్, సబ్ పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం కేవలం ఆధార్ కార్డుల అప్‌డేషన్‌కు పరిమితమైన పోస్టల్ శాఖ గతేడాది నుంచి ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు 20 నుంచి 30 టోకెన్లకు తగ్గకుండా పంపిణీ చేసి వినియోగదారులకు సమయం కేటాయిస్తున్నారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందిస్తున్నారు. టోకెన్ జారీ చేసే సమయంలోనే అవసరమైన పత్రాలను పరిశీలించి కేటాయించిన సమయంలో ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. పోస్టాఫీసుల్లో కొత్త ఆధార్ నమోదుతోపాటు కార్డుల్లో చేర్పులు, మార్పులకు సంబంధించిన పలు సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ నమోదుకు ఉచితంగా.. అప్‌డేషన్‌కు రూ.50లు వసూలు చేస్తున్నారు.
అప్‌డేషన్‌కు బయోమెట్రిక్ తప్పనిసరి
ఆధార్ అప్‌డేషన్ కోసం బయోమెట్రిక్ తప్పనిసరి. ఆధార్ వివరాలు నమోదు అనంతరం ఆథరైజ్ సిబ్బంది, కార్డుదారుడి బయోమెట్రిక్ ఆమోదం అనంతరమే యూఐడీఏఐ ప్రధాన సర్వర్ అప్‌డేషన్‌కు అనుమతిస్తుంది. మొబైల్ నెంబర్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారంగా చేర్పులు, మార్పులు పూర్తిచేస్తారు. అనంతరం అప్‌డేషన్ ప్రక్రియ పూర్తయినట్లు మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఈ తతంగం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. అనంతరం యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఈ–ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రెండున్నరేళ్లుగా..
హైదరాబాద్‌లో పోస్టల్ శాఖ ఆధార్ కేంద్రాల ద్వారా రెండున్నరేళ్లుగా పెద్ద ఎత్తున సేవలందిస్తోంది. పోస్టల్ ఆధార్ కేంద్రాల ద్వారా సుమారు 16,271 మంది కొత్తగా ఆధార్ నమోదు చేసుకోగా 1,30,996 మంది తమ ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నారు. కేవలం హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసు (జీపీవో)లో మాత్రం 1,759 మంది కొత్తగా ఆధార్ నమోదు చేసుకోగా, సుమారు 17,522 మంది తమ ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది.
ఇళ్ల వద్దకే ‘ఆధార్’ సేవలు..
పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలకు మంచి స్పందన వస్తోంది. ఇక ప్రజలకు ఇళ్ల వద్దనే ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించాం. ఆధార్ సేవలు అవసరము న్న వారు కనీసం 30 మంది ఉంటే చాలు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఆధార్ సేవలందిస్తాం. కేవలం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే చాలు. అపార్ట్‌మెంట్, వీధి, కాలనీ కమిటీ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేరు గా సెల్ నెంబర్ 9440644035ను సంప్రదించవచ్చు.
– జయరాజ్, చీఫ్ పోస్ట్‌మాస్టర్, జనరల్ పోస్టాఫీసు, అబిడ్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment