ఫిర్యాదులను స్వీకరిస్తున్న అదనపు ఎస్పీ మహేందర్
సాక్షి, సంగారెడ్డి : నా కూతురికి 2012వ సంవత్సరంలో పెళ్లి చేశాను. డబ్బుల కోసం భర్త, అత్త, మామ, ఆడపడుచులు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. మా అల్లుడు రెండో వివాహం చేసుకున్నాడు. మా అల్లుడితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని జహీరాబాద్ మండలానికి చెందిన ఓ మహిళ అదనపు ఎస్పీని కోరింది. పోలీస్ ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమంలో సోమవారం అదనపు ఎస్పీ మహేందర్‌ను కలిసి పలువురు బాధితులు సమస్యలను విన్నవించారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ గ్రీవెన్స్ సెల్‌కు అందిన మరికొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నాయి.
‘నా కూతురిని బలవంతంగా ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. నా కూతురి ఆచూకీ కోసం వారి ఇంటికి వెళితే అక్కడ కూడా అమ్మాయి కనిపించలేదు. నా కూతురు ఆచూకీ తెలుసుకొని నాకు అప్పగించాలి’ అని సదాశివపేటకు చెందిన ఓ ఫిర్యాదుదారుడు అడిషనల్ ఎస్పీని కోరాడు. నేను 2018లో చిట్కుల్ గ్రామంలో ఒక ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అయితే దాన్ని అమ్మిన వ్యక్తి ఆ ప్లాట్‌ను ఇద్దరి పేర్లపై డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడని ఆ తర్వాత తెలిసింది. దీనికి సంబంధించి ఆ వ్యక్తిని అడిగితే డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు కానీ ఇంతవరకు చెల్లించలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అడిగితే మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. మాకు న్యాయం చేయాలి’ అని ఇస్నాపూర్ మండలానికి చెందిన ఒక ఫిర్యాదిదారుడు అడిషనల్ ఎస్పీకి విన్నవించారు.
నేను 2010వ సంవత్సరంలో ముత్తంగి గ్రామంలో కొంత భూమిని కొని నా కూతురికి కట్నంగా ఇచ్చాను. ఆ భూమికి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది. ఆ భూమి తమదని కొంత మంది వ్యక్తులు 2014వ సంవత్సరంలో కోర్టులో కేసు వేశారు. ఆ కేసులో కోర్టు మాకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. అయినప్పటికీ కొంత మంది డబ్బులు ఇచ్చి ఆ భూమిని సెటిల్మెంట్ చేసుకోవాలని, లేకుంటే కాంపౌండ్ వాల్ కూలగొడతామని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయండి అని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు అడిషనల్ ఎస్పీకి విన్నవించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment