
సాక్షి, హైదరాబాద్: చదువు పూర్తయ్యాక గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగం చేద్దామనుకున్నవారి ఆశలపై ఒమన్ (మస్కట్) ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్, మార్కెటింగ్ తదితర రంగాల్లోని 87 రకాల ఉద్యోగాలకు వీసాలను నిలిపివేసింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. దీనిని ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చింది. విదేశాల నుంచి వలసలు పెరుగుతుండటం, స్వదేశంలో నిరుద్యోగులు పెరుగు తుండటంతో ఒమన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కున్నట్టు చెబుతున్నారు. దీనిపై మిగతా గల్ఫ్ దేశాల్లోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒమన్ నిర్ణయం ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిరుద్యోగులకు ఆశనిపాతంగా మారుతోంది.
ఉన్నత ఉద్యోగాల కోసం..
గల్ఫ్ దేశాల్లో దాదాపు ఇరవై లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన 4.75 లక్షల మంది గల్ఫ్‌కు వలస వెళ్లినట్లు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో వెల్లడైంది. తర్వాత ఆ సంఖ్య మరింతగా పెరిగింది. యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–దుబాయి, అబుదాబీ, షార్జా, రస్ అల్ ఖైమా, అజ్‌మన్, ఫుజైరా, ఉమల్‌ఖివైన్ ప్రాంతాలు)లోనే రెండు లక్షల మంది తెలంగాణవారున్నారు. వారిలో చాలా మంది భవన నిర్మాణం, ఇతర రంగాల్లో కార్మికులుగా, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. ఇక యూఏఈ తర్వాత ఒమన్ (మస్కట్)కు ఎక్కువ మంది తెలుగువారు ఉపాధి పొందుతున్నారు. అయితే ఒమన్ సంపన్న దేశం కావడం, పర్యాటక రంగం కీలకం కావడంతో హోటళ్లు, ఇంజనీరింగ్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, సేల్స్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ. దీంతో గత పదేళ్లుగా తెలంగాణ యువత ఈ రంగాల్లో ఉద్యోగాల కోసం ఒమన్ బాట పట్టింది.
స్వదేశీయులకు ప్రాధాన్యం కోసం
విదేశాల నుంచి వలసలు పెరగటంతో ఒమన్‌లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. స్థానికులకు ఉద్యోగాలు అందని పరిస్థితి తలెత్తింది. దీంతో కీలకమైన ఉద్యోగాలు స్వదేశీయులకే చెందాలని ఒమన్ యువత డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కీలకమైన ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీపై ఆరు నెలల పాటు నిషేధం విధించింది. అన్ని కంపెనీలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు విధిగా స్థానిక నిరుద్యోగులతోనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించింది.
వీసాలు నిషేధించిన రంగాలివే..
నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, తమ దేశంలో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఒమన్ ప్రభుత్వం వీసాలపై నిషేధం నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యవృత్తి, మార్కెటింగ్–సేల్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్సూరెన్స్, ఎయిర్‌పోర్ట్, ఇంజనీరింగ్, టెక్నికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ మీడియా రంగాల్లోని 87 ఉద్యోగాలకు నిషేధం వర్తించనుంది.
చిన్న కంపెనీ అయినా.. ఒమానీలే
‘‘గతంలో ఎక్కడ ఉద్యోగావకాశం ఉన్నా విదేశీయులా, స్వదేశీయులా అని పట్టించుకోకుండా ఒమన్ ప్రభుత్వం వీసాలు ఇచ్చింది. కానీ కొంతకాలంగా కీలక రంగాల ఉద్యోగాల్లో ఒమనీలే ఉండాలనే డిమాండ్ తలెత్తింది. చిన్నా, పెద్దా అన్ని కంపెనీల్లో ఎక్కువ శాతం స్వదేశస్తులే ఉండేలా నిబంధనలను రూపొందించింది. పది మంది ఉద్యోగులుండే చిన్న హోటల్‌లో కూడా కనీసం ఆరుగురు స్వదేశస్తులు ఉంటేనే అనుమతి మంజూరు చేస్తోంది..’’
– ఒమన్‌లో ప్రైవేటు జాబ్ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ప్రకాశ్
Comments
Please login to add a commentAdd a comment