ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ పరీక్ష!
⇒ పారదర్శకత కోసం టీఎస్ పీఎస్‌సీ యత్నం
⇒ అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు సేకరిస్తున్న సీఎం కార్యాలయం
సాక్షి ,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్ పీఎస్‌సీ) ద్వారా భర్తీ చేయనున్న దాదాపు 2 వేల వరకు అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) వంటి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ పరీక్ష విధానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ విధానం అమలుపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏఈ, ఏఈఈ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండే అవకాశం ఉన్నందున ఆన్‌లైన్ పరీక్ష విధానం ప్రవేశ పెడితే బాగుంటుందన్న యోచన చేస్తున్నట్లు తెలిసింది. వివిధ పోటీ పరీక్షల నిర్వహణ విధానాలపై ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ), ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న పరీక్ష విధానాలపై అధ్యయనం చేసిన టీఎస్ పీఎస్‌సీ.. ఐఐటీ వంటి పరీక్షల్లో అనుసరిస్తున్న ఆన్‌లైన్ పరీక్ష విధానంపైనా అధ్యయనం చేసింది.
దీంతో ఆన్‌లైన్‌లో పోస్టుల భర్తీకి చర్యలు చేపడితే బాగుంటుందని, పారదర్శకతతో పాటు అభ్యర్థికి త్వరగా ఫలితాలు ఇవ్వడం సాధ్యం అవుతుందని భావిస్తోంది. ఒకవేళ ఆన్‌లైన్ విధానం అమలు సాధ్యం కాకపోతే రాత పరీక్షల (ఆఫ్‌లైన్)ను నిర్వహించే వీలుంది. మరోవైపు ఇతర పరీక్షలతో పాటు, డిస్క్రిప్టివ్ విధానం ఉండే పోటీ పరీక్షల్లో మాత్రం ఆన్‌లైన్ విధానం కాకుండా రాత పరీక్ష విధానాన్నే అనుసరించనుంది.
వారం రోజుల్లో అనుమతులు..
పోటీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వివిధ అనుమతులు రావాల్సి ఉంది. మంగళవారం సీఎం కేసీఆర్ ప్రకటనతో అనుమతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం (సెల్) ఇప్పటికే శాఖల నుంచి ఖాళీల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించే పనిలో పడింది.
మరోవైపు అనుమతులపై కూడా దృష్టి పెట్టింది. పోటీ పరీక్షల విధానం (స్కీం), పోటీ పరీక్షల్లో పెట్టాల్సిన సిలబస్, 371(డి) కొనసాగింపు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తుందా? కొత్త రోస్టర్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెడుతుందా? అన్న విషయంలో స్పష్టత, గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు పెంపు వంటి అంశాలపై ఉత్తర్వులు అన్నీ వారం రోజుల్లో ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో వెనువెంటనే నోటిఫికేషన్లను టీఎస్ పీఎస్‌సీ ద్వారా జారీ చేయించే అవకాశం ఉంది.
వన్ టైం రిజిస్ట్రేషన్‌కు భారీ స్పందన...
టీఎస్ పీఎస్‌సీ ప్రవేశపెట్టిన వన్ టైం రిజిస్ట్రేషన్‌కు భారీ స్పందన లభిస్తోంది. మే చివరి నాటికి 80 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన మంగళవారం నాడు అనేక మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిసింది.
నోటిఫికేషన్ల సమాచారం ఎస్‌ఎంఎస్‌ల్లో
అభ్యర్థి ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అతని విద్యార్హతలను బట్టి ఫలానా నోటిఫికేషన్ జారీ అయిందన్న సమాచారం అభ్యర్థికి ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తుంది. అంతేకాకుండా ఈ-మెయిల్ ద్వారా కూడా ఈ సమాచారం వస్తుంది. దీంతో అభ్యర్థి పరీక్ష ఫీజు చెల్లిస్తే చాలు. మళ్లీ మళ్లీ దరఖాస్తు ఫారాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు.