గాడితప్పిన ‘పరిషత్’ పాలన | Parishad works going in wrong way | Sakshi
Sakshi News home page

గాడితప్పిన ‘పరిషత్’ పాలన

Published Thu, Aug 20 2015 4:48 AM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM

గాడితప్పిన ‘పరిషత్’ పాలన - Sakshi

గాడితప్పిన ‘పరిషత్’ పాలన

- 36 మండలాలకు 19 మందే ఎంపీడీఓలు
- 16 ఈఓపీఆర్‌డీ పోస్టులూ ఖాళీ
- ఏళ్లుగా భర్తీకి నోచుకోని పోస్టులు
- పదోన్నతులను గాలికొదిలిన ప్రభుత్వాలు
ఇందూరు :
గ్రామాల అభివృద్ధికి బాటలు వేసే మండల పరిషత్ కార్యాలయాలు ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు ప్రజలు, అధికారులతో కళకళలాడిన ఈ కార్యాలయాలు ఇప్పుడు వెలవె లబోతున్నాయి. రెగ్యులర్ ఎంపీడీఓలు లేకపోవడం, నిధుల లేమితో పాలన గాడి తప్పింది. అధికారులు ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. 17 సంవత్సరాలుగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కిందిస్థాయి అధికారులకు పదోన్నతులు కల్పించలేదు. ఫలితంగా మండల పరిషత్‌ను అధికారుల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. ఇన్‌చార్జ్‌లు పని భారం మోయలేకపోతున్నారు.  

జిల్లాలోని 36 మండలాల్లో 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉద్యోగ విరమణ, ఇతర కారణాలతో ప్రస్తుతం 17 మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 19 మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంపీడీఓలున్నారు. సగం మండలాల్లో సూపరింటెండెంట్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యులర్ ఎంపీడీఓలకు జిల్లా పరిషత్‌లో ఒకరికి డిప్యూటీ సీఈఓగా, మరొకరికి ఏఓగా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఈఓపీఆర్‌డీ పోస్టుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మండలానికి ఒకరు చొప్పున 36 మండలాలకు 36 మంది రెగ్యులర్ అధికారులు ఉండాలి.

కానీ, ప్రస్తుతం 16 మండలాల్లో ఈ పోస్టులు అధికారులు లేక వెక్కిరిస్తున్నాయి. దీంతో సూపరింటెండెంట్లకు, పంచాయతీ కార్యదర్శులకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్ కార్యకలాపాలు చూడటం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధిహామీ, మరుగు దొడ్ల నిర్మాణం, మండల పరిషత్ సమావేశాల నిర్వహణ, ఇతర పనులతో పనిభారం తీవ్రమైందని ఇన్‌చార్‌‌జ అధికారులు వాపోతున్నారు. 718 గ్రామ పంచాయతీలు, 477 క్లస్టర్లకు 236 మంది మాత్రమే రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు.  
 
పదోన్నతులు లేకపోవడం కూడా ప్రధాన కారణం...
ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీల కొరత వెనుక ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా దాదాపు 41 మంది సూపరింటెండెంట్లు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు. నిజానికి 5 సంవత్సరాలు ఇదే పోస్టులో పనిచేసిన వారికి ఎంపీడీఓగా పదోన్నతి కల్పించాలనే నిబంధన ఉంది. ప్రభుత్వాలు తమను రెగ్యులర్ చేస్తాయనే ఆశతో పనిచేసిన సూపరింటెండెంట్లు చాలా మంది ఉద్యోగ విరమణ పొందారు. అయితే పదోన్నతుల విషయంతో పాటు తమకు గెజిటెడ్ హోదా కల్పించాలనే డిమాండ్‌తో పంచాయతీ రాజ్ కమిషనర్‌ను కలుస్తూనే ఉన్నారు. కానీ,పదోన్నతులకు మాత్రం మోక్షం లభించడం లేదు. అతిగా ఒత్తిడి చేస్తే కోర్టులో కేసు ఉందని చెప్పి బుకాయిస్తున్నారు.
 
నిబంధనల ప్రకారం చూస్తే ఎంపీడీఓ పోస్టులను సీనియార్టీ జాబితా ప్రకారం 35 శాతం సూపరింటెండెంట్లకు, 35 శాతం ఈఓపీఆర్‌డీలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలి. 30 శాతం పోస్టులను నేరుగా ప్రభుత్వమే భర్తీ చేయాలి. 1998 సంవత్సరం తర్వాత ఒక్కరికి కూడా పదోన్నతులు కల్పించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తే జిల్లాలో ఖాళీ ఉన్న 17 ఎంపీడీఓ, 16 ఈఓపీఆర్‌డీ పోస్టులు ఎప్పుడో భర్తీ అయ్యేవి. ఖాళీ అయిన ఈఓపీఆర్‌డీ, సూపరింటెండెండ్ పోస్టులు పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతుల ద్వారా లభించేవి.
 
పదోన్నతులు చేపట్టాలి
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వద్దకు చేర్చాలంటే మండల పరిషత్ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇలాంటి మండల పరిషత్‌తో ఎంపీడీఓతో పాటు, సూపరింటెండెండ్, ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులు పూర్తి స్థాయిలో ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో 36 మండలాల్లో 50 శాతం ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. తద్వారా పాలన సాధ్యం కావడం లేదు. ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయిస్తే తప్పులు దొర్లే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వాలు పదోన్నతుల విషయాన్ని మరిచిపోయాయి. ఏళ్లుగా పదోన్నతులు లేక ప్రధాన పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఉద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. ప్రభుత్వం పదోన్నతులు వెంటనే చేపట్టాలి.   
  - గోవింద్, ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement