సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 19 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటికి అనుబంధంగా ఒక్కో దానికి బోధనాసుపత్రి ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రులకు రోగులు వెల్లువెత్తుతుండగా, ప్రైవేటు బోధనాసుపత్రులపై రోగులు పెద్దగా ఆసక్తి చూపడంలేదన్న చర్చ వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో జరుగుతోంది. ఆయా ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన వైద్యులు, ప్రొఫెసర్లు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు బోధనాసుపత్రుల్లో పడకలున్నా నిండటంలేదన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటిని అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆయన సంకల్పించారు. దీంతో వెద్య ఆరోగ్య శాఖ వర్గాలు కసరత్తు ముమ్మరం చేశాయి.
11 వేలకు పైగా పడకలు..
రాష్ట్రంలో 19 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. ప్రతి బోధనాసుపత్రికి కనీసంగా 600 పడకలున్నాయి. కొన్నింటికి వెయ్యి వరకు ఉన్నాయి. కనీసంగా 600 పడకలు ఉన్నాయనుకున్నా 11 వేలకు పైగా పడకలు ఆయా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు లెక్క. అంతేకాదు వాటిల్లో ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ పడకలు అదనం. అయితే, అనేక బోధనాసుపత్రులకు రోగులు పెద్దగా రావడంలేదన్న అభిప్రాయం వైద్య శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో పడకలు ఖాళీగా ఉంటున్నాయి. పాత జిల్లాల ప్రకారం చూస్తే ప్రతి జిల్లాలో ప్రైవేటు బోధనాసుపత్రులు ఉన్నప్పటికీ, రోగులు మాత్రం హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రులు, గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ బోధనాసుపత్రులపైనే ఆధారపడుతు న్నారు. దీంతో హైదరాబాద్‌కు రోగుల తాకిడి పెరగడంతో పాటు, ఖర్చు తడిసి మోపెడు అవుతోంది.
ఎందుకీ పరిస్థితి?
ఉదాహరణకు ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ నగరంలోనే ఉంది. దీనివల్ల రోగులు సులువుగా వెళ్లి రావడానికి వీలుంటుంది. కానీ కొన్ని జిల్లాల్లో ప్రైవేటు బోధనాసుపత్రులు పట్టణ కేంద్రాలకు దూరంగా ఉండటం వల్ల రోగులు వెళ్లడంలేదు. ఫలితంగా వాటిల్లో పడకలు నిండటంలేదని అంటు న్నారు. బోధనాసుపత్రులు ఉచిత వైద్య సేవలు అందించకపోవడం వల్ల కూడా రోగులు ముందుకు రావడంలేదు. జూనియర్ వైద్యులతో చికిత్స చేయిస్తున్నారన్న భావన కూడా నెలకొని ఉందన్న చర్చ జరుగుతోంది.
‘కేసీఆర్ కిట్’అమలుకు అవకాశం ఇవ్వాలి...
ఆరోగ్యశ్రీలోని దాదాపు 100 రకాల చికిత్సలను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే సర్కారు పరిమితం చేసింది. వాటికి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయడంలేదు. ఉదాహరణకు అపెండిసైటిస్, హిస్టరెక్టమీ తదితర జనరల్ సర్జరీలకి సంబంధించినవి ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేశారు. దీంతో అనేకమంది ఆరోగ్యశ్రీ రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్తున్నారు. ఆ చికిత్సలను ప్రైవేటు బోధనాసుత్రులకూ అనుమతి ఇవ్వాలని యాజమాన్యాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. ఇలా చేస్తే తమ వద్దకు కూడా రోగులు వస్తారని అంటున్నారు. ప్రైవేటు బోధనాసుపత్రుల్లోని పడకలను అందుబాటులోకి తీసుకురావాలంటే పలు సంస్కరణలు చేయాల్సిన అవసరముందని పలువురు వైద్య నిపుణులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment