పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం
అభిమాన నటుడు సమయానికి రాలేదని కన్నెర్ర
కుర్చీలు ధ్వంసం.. స్టేజి పైకి రాళ్లు
పోలీసుల లాఠీచార్జి.. తొక్కిసలాట
సనత్‌నగర్, న్యూస్‌లైన్: జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులు చుక్కలు చూశారు. పవన్ నిర్ణీత సమయానికి అమీర్‌పేట సత్యం థియేటర్ వద్ద జరగాల్సిన ప్రచార కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఓపిక నశించిన అభిమానులు చేతికందిన వస్తువులను నేలకేసి కొట్టి హంగామా సృష్టించారు.
పవన్‌కళ్యాణ్ సత్యం థియేటర్ వద్దకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు వస్తారని స్థానిక నేతలు ప్రచారం చేశారు. దీంతో అమీర్‌పేట్ పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటూ హాస్టల్‌లో ఉండే యువకులు పెద్దసంఖ్యలో మూడు గంటలకే వేదిక వద్దకు చేరుకున్నారు. రాత్రి 9 అయినా పవన్ రాలేదు. ఇదిగో ఇప్పుడే వస్తున్నారంటూ నిర్వాహకులు ఎప్పటికప్పుడు చెబుతూ అక్కడికి హాజరైన వారికి సర్దిచెబుతూ వచ్చారు. ఎంతకీ రాకపోయేసరికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కుర్చీలను నేలకేసి కొట్టారు.
ఇంకొందరు వాటర్ ప్యాకెట్లను, కట్టెలను, రాళ్లను అందుకుని స్టేజీ మీదకు విసిరారు. పోలీసులు వారిపై లాఠీచార్జీకి దిగారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు కిందపడిపోయారు. యువతులు, అభిమానులు బతుకుజీవుడా అంటూ తలోదిక్కుకు పరుగులు తీశారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. చివరకు 9.10 నిమిషాలకు పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెగిన కరెంటు వైర్... త్రుటిలో తప్పిన ప్రమాదం
తొక్కిసలాటలో విద్యుత్ తీగలు తెగిపోయాయి. స్టేజీకి ఏర్పాటుచేసిన లైట్లు ఆరిపోవడంతో విషయాన్ని తెలుసుకుని వెంటనే అక్కడే ఉన్న ఎలక్ట్రీషియన్ అప్రమత్తమై సరఫరా నిలిపివేశారు. దీంతో ముప్పు తప్పింది. అయితే, రాత్రి 9.10 గంటలకు వచ్చిన పవన్‌కళ్యాణ్ ఐదంటే ఐదే నిమిషాల పాటు మాట్లాడి వెళ్లిపోవడం స్థానికులను నిరుత్సాహానికి గురిచేసింది.