డబ్బు కట్టేవారికే వైద్యం! | pay money only in doctors | Sakshi
Sakshi News home page

డబ్బు కట్టేవారికే వైద్యం!

Published Thu, Nov 6 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

డబ్బు కట్టేవారికే వైద్యం!

డబ్బు కట్టేవారికే వైద్యం!

  • హెల్త్ కార్డుల ఉద్యోగులకు ఆస్పత్రుల స్పష్టీకరణ
  • ఆస్పత్రులతో ఇంకా కుదరని ఒప్పందం.. కొలిక్కిరాని ప్యాకేజీ రేట్లు
  • ఆర్భాటంగా ఈహెచ్‌ఎస్ పథకం ప్రారంభించిన రెండు రాష్ట్రాలు
  • సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీపై పోటీపడి వ్యవహరించిన ఏపీ, తెలంగాణ సర్కారులు వైద్యసేవలు అందించే ప్రైవేట్ ఆస్పత్రులతో ఇంతవరకూ అసలు ఒప్పందమే కుదుర్చుకోలేదు. ఈ కార్డులతో ఆస్పత్రులకు వెళ్తున్న ఉద్యోగులను డబ్బు కట్టి వైద్య సేవలు పొందాలని యాజమాన్యాలు స్పష్టం చేయటంతో కంగుతింటున్నారు.
     
    ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లంటే కుదరదు..

    ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్‌కార్డులతో నగదు రహిత వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన ఇరు ప్రభుత్వాలు ఆర్భాటంగా ఈహెచ్‌ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) పథకాన్ని ప్రారంభించాయి. అయితే ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగికి కూడా నగదు రహిత వైద్య సేవలు అందలేదు. వైద్య సేవలపై ఆస్పత్రులతో ఇంతవరకు అంగీకారం కుదరకపోవడమే దీనికి కారణం. ఇరు రాష్ట్రాలు ఇప్పటికే పదుల సంఖ్యలో సమావేశాలు జరిపినా ఫలితం లేదు. ఉద్యోగులకు వైద్య సేవల ప్యాకేజీ రేట్లపై ఎలాంటి నిర్ణయం జరగలేదు.

    కొందరు ఉద్యోగులు హెల్త్‌కార్డ్‌లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వెళ్లగా నగదు చెల్లిస్తేగానీ వైద్యం చేయలేమని కరాఖండీగా తేల్చి చెప్పాయి. ప్యాకేజీ రేట్లతో పాటు, ఓపీ సేవలు, గదుల అద్దె తదితర అంశాలపై ప్రభుత్వం ఏ విషయం తేల్చలేదని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. కార్పొరేట్ల సామాజిక బాధ్యతగా దారిద్య్రరేఖ దిగువన ఉన్నవారికి సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీలకు ఒప్పుకున్నామని, ఉద్యోగులకు కూడా అవే ప్యాకేజీలంటే కుదరవని స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోనే ఎక్కువ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
     
    రీయింబర్స్‌మెంట్‌కు 30 వరకే గడువు

    వైద్యసేవలపై ఇంతవరకు ఓ నిర్ణయం తీసుకోకపోగా మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు నవంబర్ 30 వరకే గడువు విధించడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. డిసెంబర్ 1నుంచి వైద్యసేవలు పొందిన వారికి మెడికల్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు. ఈలోగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు, ప్రభుత్వానికి మధ్య రేట్లపై ఒప్పందం కుదరకపోతే తమ పరిస్థితి ఏమిటని ము ఖ్యంగా పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
     
     ఇంకా ఎంవోయూ జరగలేదు
     ఉద్యోగులకు సేవలందించే విషయంపై ప్రభుత్వానికి, ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఎంవోయూ (అవగాహనా ఒప్పందం) జరిగితే గానీ సేవలు అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు త్వరలోనే ముందుకొచ్చి దీనిపై నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాం.
     - డాక్టర్ గురవారెడ్డి (తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు)
     
     చాలా సమస్యలున్నాయి...
     ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలపై ప్రభుత్వానికి, ఆస్పత్రుల యాజమాన్యాలకూ మధ్య సమస్యలున్నాయి. ఇరు పక్షాలు ఓ అంగీకారానికి వస్తే తప్ప వైద్య సేవలు అందించలేం. ఈనెల 12న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఆధ్వర్యంలో చర్చలు జరగనున్నాయి. ఫలప్రదమైతే సేవలందించేందుకు ముందుకొస్తాం.    
         - డాక్టర్ రమణమూర్తి (ఏపీ సూపర్
     స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు)
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement