
పెన్‌గంగ భవన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి
సాక్షి, ఆదిలాబాద్: త్వరలోనే కోర్టా–చనాక బ్యారేజీని ప్రారంభిస్తామని, ఈ సంవత్సరమే పనులు పూర్తవుతాయని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్మించిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ (పెన్‌గంగ భవన్) కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ.5.28 కోట్ల వ్యయంతో పెన్‌గంగ భవన్, గెస్ట్ హౌజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కార్యాలయం జిల్లాలోని నీటిపారుదల అధికారుల పర్యవేక్షణకు అనువైన ప్రాంతమని తెలిపారు. హరితహారం ద్వారా నాటిన మొక్కల్లో 80 శాతం రక్షించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టాలను రూపొందించారని అన్నారు. 24 శాతం ఉన్న అడవిని 33 శాతానికి పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
గ్రామాల్లో 80 శాతం మొక్కలను రక్షించని సర్పంచ్‌లపై వేటు తప్పదని హెచ్చరించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి రూ. 8.25 కోట్లు ప్రతిపాదించడం జరిగిందని, మన జిల్లాలో పెన్‌గంగ నది బ్యారేజీ నిర్మాణం అరవై ఏళ్ల కల అని, కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కోర్టా–చనాక బ్యారేజీ ద్వారా 50 వేల ఎకరాల పంట పొలాలకు నీరంది పెన్‌గంగ పరివాహక ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇప్పటి వరకు 17 గేట్లు పూర్తి చేయడం జరిగిందని, వర్షాల కారణంగా ఇంకో 6 గేట్లు బిగించడం నిలిచిపోయిందన్నారు. త్వరలోనే వాటి పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ జనార్దన్, జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, బోథ్ ఎమ్మెల్యే బాపురావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment