15లోగా పింఛన్లు
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యంపై అసంతృప్తి
ఆదాయ పరిమితిలోపు ఉన్న ఉద్యోగులకూ పెన్షన్
జనవరి ఒకటో తేదీలోగా ఆహార భద్రతా కార్డులు
ప్రభుత్వ భూములను గుర్తించాలి.. వాటర్‌గ్రిడ్
పైపులైన్లకు రైట్ ఆఫ్ వే ఇవ్వాలి
చెరువుల పునరుద్ధరణ, రహదారులు, హరిత హారంపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ల సమావేశంలో ఆదేశించిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన జాప్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక భద్రతా పెన్షన్లతో పేదలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో నామమాత్రంగా ఉన్న మొత్తాన్ని ఐదింతలు పెంచామని, అయితే లబ్ధిదారుల ఎంపికలో జాప్యంతో ప్రజల్లో అనవసర ఆందోళన పెరిగిందని సీఎం అసహనం వ్యక్తం చేశారు. అర్హులైనవారికి ఈనెల 15వ తేదీలోగా పెంచిన పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు. అలాగే ఈనెలాఖరులోగా ఆహార భద్రతా కార్డుల పంపిణీ పూర్తవ్వాలని, జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన రేషన్ లబ్ధిదారులకు అందేలా చూడాలని స్పష్టం చేశారు. పేదలకు సహాయం అందించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించదని తెలిపారు. సోమవారం కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సామాజిక భద్రతా పెన్షన్లు, ఆహార భద్రతా కార్డుల పంపిణీతోపాటు, వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, హరితహారం, రహదారులు, భూముల పరిరక్షణ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, తారకరామారావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత ఇచ్చారు.
1.గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయంలోపు ఉండే ప్రైవేట్ ఉద్యోగుల కుటుంబాలను పేదవారిగా గుర్తించి వారికి పెన్షన్లు, ఆహార భద్రతా కార్డులు పంపిణీ చేయాలి. డిసెంబర్ 15లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి. జనవరి ఒకటి నుంచి కొత్త రేషన్ అందాలి.
2.పెన్షన్లు, ఆహార భద్రతా కార్డుల జారీ కోసం నియోజకవర్గానికో నోడల్ అధికారిని నియమించాలి. అర్హులను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించొద్దు. అర్హులు ఇంకా మిగిలితే దరఖాస్తు తీసుకుని పరిశీలించి మంజూరు చేయాలి.
3. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలి. వాటిని కబ్జా కాకుండా చూడాలి. ఆర్‌అండ్‌బీ, అటవీ అతిథి గృహాలు, వాటి కింద స్థలాలు చాలా ఉన్నాయని వాటిని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా తయారు చేయాలి. ఎస్‌ఆర్‌ఎస్‌పీ, నాగార్జునసాగర్, జూరాల, తదితర ప్రాజెక్టుల కోసం కార్యాలయాలు, ఇతర అవసరాలకు భూమి సేకరించారు. ఆ వివరాలన్ని తీసుకుని ఆక్రమణను అరికట్టాలి. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా నిర్మించాలి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను పరిశ్రమల కోసం రిజర్వ్ చేయాలి.
4. ప్రతీ ఇంటికి నల్లాతో మంచినీరు అందించే బృహత్తర తెలంగాణ వాటర్‌గ్రిడ్ కార్యక్రమానికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. ప్రాజెక్టుల్లో పదిశాతం నీటిని గ్రిడ్‌కోసం కేటాయించినందున రిజర్వాయర్లలో ఇంటెక్‌వెల్స్ నిర్మించాలి. పైపులైను నిర్మాణానికి రైట్ ఆఫ్ వే ఇవ్వాలి. ఇంటెక్, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి.
5. చెరువులను కబ్జాచేసిన వారి విషయంలో రాజీపడొద్దు. ఆక్రమణలు వెంటనే తొలగించాలి. వాటి రక్షణకు కఠినంగా వ్యవహరించాలి. ఫీడర్‌చానెల్స్‌ను ఆక్రమణల నుంచి తొలగించాలి. చెరువుల్లో నీరు లేనప్పుడే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలి. కోర్టు వివాదాలు ఉంటే.. కార్యదర్శుల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. చెరువు చుట్టూ సిల్వర్ ఓక్ చెట్లను పెంచాలి. ఏక్‌సాలా, ఏక్‌ఫజలా పట్టాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
6. రహదారుల నిర్మాణం, మరమ్మతులు, మెరుగుదల పనులను వెంటనే ప్రారంభించాలి. కలెక్టర్లు నాణ్యతను పరిశీలించాలి. రహదారుల కోసం కొత్త కంకర అవసరమున్నందున కొత్త క్రషర్లను అనుమతించే అధికారం కలెక్టర్లకు బదిలీ చేస్తున్నాం. హరితహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రోడ్ల పక్కన ఆకర్షణీయమైన పూల చెట్లు నాటడడంతోపాటు విరివిగా మొక్కలు నాటాలి.