చిన్నారులకు మరో కొత్త వ్యాక్సిన్ | pentavalent vaccination immunisation for childrens | Sakshi
Sakshi News home page

చిన్నారులకు మరో కొత్త వ్యాక్సిన్

Published Thu, Jul 17 2014 12:39 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

pentavalent vaccination immunisation for childrens

ఆదిలాబాద్ అర్బన్ :  వివిధ వ్యాధుల నుంచి రక్షణ కోసం ఐదేళ్లలోపు చిన్నారులకు నూతనంగా ఫెంటావలెంట్ వ్యాక్సిన్ అక్టోబర్ నుంచి వేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మొదటిసారిగా చిన్నపిల్లల మరణాలను అరికట్టడానికి ఫెంటావలెంట్ వ్యాక్సిన్ వినియోగిస్తున్నట్లు తెలిపారు.

 ఈ వ్యాక్సిన్ అత్యంత శక్తివంతమైన ఫెర్టసిస్, టెటానస్, హైపటైటిస్, హెచ్‌ఐవీ తదితర వ్యాధుల బారి నుంచి రక్షిస్తుందని చెప్పారు. ప్రధానంగా ఆరు వారాలలోపు పిల్లలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌పై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో, ఆస్పత్రుల్లో ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. అనంతరం ఫెంటావలెంట్ వ్యాక్సిన్ పనితీరును ప్రొజెక్టర్ ద్వారా డాక్టర్ పండరీనాథ్ కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, ఇమ్యూనైజేషన్ అధికారి తొడసం చందు, డాక్టర్ జలపతి నాయక్, డీసీహెచ్‌ఎస్ చంద్రమౌళి, ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీ, అధికారులు పాల్గొన్నారు.

 గ్రామాలను హరితహారంగా మార్చాలి
 జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని హరితహారంగా మార్చేందుకు నర్సరీల ద్వారా అవసరమైన మొక్కలు పెంచాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ సోషల్ ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్‌లో అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అటవీ శాఖ, డ్వామా, ఐటీడీఏ, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు నర్సరీల ద్వారా ఎన్ని మొక్కలు పెంచుతున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు 73 లక్షల వివిధ రకాల మొక్కలు పెంచినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు.

మన ఊరు - మన ప్రణాళికలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీకి 8 వేల మొక్కల చొప్పున పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్య, వైద్య, బీసీ కార్పొరేషన్‌లకు ఎన్ని మొక్కలు కావాలో ప్రతిపాదనలు పంపాలన్నారు. అనంతరం సామాజిక వన విభాగం జిల్లా శాఖ ముద్రించిన వృక్షో రక్షతి.. రక్షితః పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అటవీ సంరక్షణ అధికారి తిమ్మారెడ్డి, డివిజనల్ అటవీ అధికారులు వినోద్ కుమార్, ప్రభాకర్, డీపీవో పోచయ్య, ఉప విద్యాధికారి రామరావు, పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఈ ఉమా మహేశ్వర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

 ‘స్వగృహ’ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
 రాజీవ్ స్వగృహ ద్వారా ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రాజీవ్ స్వగృహ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 201 మంది స్వగృహ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆదిలాబాద్‌కు సంబంధించి బట్టిసావర్‌గాం గ్రామ పంచాయతీ పరిధిలో భూమిని గుర్తించి లబ్ధిదారులకు అందించామని రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు.

 కాగజ్‌నగర్‌లో 93 దరఖాస్తుల కోసం భూమిని గుర్తించి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేశామన్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల, నిర్మల్, భైంసా పట్టణాల్లో భూమి లభ్యం కాకపోవడంతో ఇంకా అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా పట్టణాల్లో భూములు సేకరించి వెంటనే లబ్ధిదారులను గుర్తించాలని జీఎంను ఆదేశించారు. సమావేశంలో రాజీవ్ స్వగృహ జిల్లా ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ ఉద్దవ్ పాల్గొన్నారు.

 23న యువజనోత్సవాలు..
 ఆదిలాబాద్ కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదే శాల మేరకు జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. ఆర్థిక, సామాజిక, దేశభక్తి, పర్యావరణ, విద్య, వైద్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళా ప్రదర్శనలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ నెల 23న ఆదిలాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 31న బోథ్ నియోజకవర్గ స్థాయి యువజనోత్సవాలు ఇచ్చోడ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 33 అంశాల్లో పోటీలు ఉంటాయని, ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచినవారు నవంబర్‌లో నిర్వహించే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. వివరాలకు  08732-226441, 9618665123 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement