
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలిస్తున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. గత రెండ్రోజులుగా 1,160 మందిని ధూలపల్లి, వికారాబాద్, గచ్చిబౌలి స్టేడియం, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ, రాజేంద్రనగర్ ఎన్‌ఐఆర్‌డీ, నారాయణమ్మ కాలేజీ, అమీర్‌పేట నేచర్ క్యూర్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆయా కేంద్రాల్లో ప్రత్యేక పడక గదులు సిద్ధం చేశామన్నారు. విమానాశ్రయంలో దిగగానే వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకొని స్లిప్పులను అందజేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి వెళ్లకుండా ఒక్కో కేంద్రానికి ఒక ఏసీపీని ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు తెలిపారు.
కాగా దూలపల్లి ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఒక్కో గదిని ఇద్దరికి కేటాయించారని, బాత్రూంలు ఇలా చాలా చోట్ల పరిశుభ్రత లేదని పలువురు ఎన్‌ఆర్‌ఐలు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం 6 అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు దేశీయంగా 30 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment