వెళ్లాడు.. వచ్చాడు.. జనంలో తిరిగాడు! | People Fear on Positive Case File in Medak | Sakshi
Sakshi News home page

జిల్లాలో ‘కరోనా’ అలజడి

Published Thu, Apr 2 2020 7:35 AM | Last Updated on Thu, Apr 2 2020 7:35 AM

People Fear on Positive Case File in Medak - Sakshi

మెదక్‌ పట్టణంలో రసాయన ద్రావణం పిచికారీ చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

కరోనా మహమ్మారి జిల్లాలో అలజడి సృష్టిస్తోంది. మెదక్‌ పట్టణానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలడంతో మెతుకుసీమ వ్యాప్తంగా కలవరం మొదలైంది. జిల్లా ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం బాధితుడి నివాస ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేసింది. అతడి కుటుంబ సభ్యులను వైద్య చికిత్సల నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించింది. బాధితుడు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? వంటి అంశాలపై పోలీసులు      కూపీ లాగుతున్నారు.

సాక్షి, మెదక్‌: ఢిల్లీలో మతపరమైన ప్రార్థనకు వెళ్లి కరోనా బారిన పడిన వ్యక్తి నివాస స్థలం మెదక్‌ పట్టణంలోని ఆజంపుర. అతడి వ్యవసాయ భూమి మాచవరం గేటు వద్ద ఉంది. దీని పక్కనే ర్యాలమడుగులో అతడి బంధువులు ఉన్నారు. మత గురువు కావడం.. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అతడు పలువురితో సమావేశమైనట్లు.. బంధువుల ఇంటికి సైతం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ మేరకు ఎవరూ బయటకు రాకుండా.. ఆయా ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకరు దుబాయిలో ఉంటుండగా.. మిగిలిన పది మందిని అదుపులోకి తీసుకుని మెదక్‌ ఏరియా ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించి.. వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం అందరిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. వీరితో పాటు కరోనా బాధిత వ్యక్తికి సంబంధించిన బంధువులు.. ర్యాలమడుగుకు చెందిన నలుగురిని కూడా ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

వార్డుల వారీగా సర్వే
మెదక్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు మరింత కట్టడి చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా మున్సిపల్, వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే చేపడుతున్నారు. పట్టణంలో వార్డుల వారీగా ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు జల్లెడ పడుతున్నారు.

రసాయన ద్రావణం పిచికారీ..
జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఆయా శాఖల అధికారులు రంగంలోకి దిగారు. మెదక్‌ మున్సిపల్‌ అధికారుల ఆధ్వర్యంలో ఆజంపురతోపాటు పట్టణ వ్యాప్తంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడం, చెత్త తొలగించారు. అంతేకాదు.. హైడ్రోక్లోరైడ్, బ్లీచింగ్‌ పౌడర్‌ ద్రావణాన్ని ఫైరింజన్‌ సాయంతో పిచికారీ చేశారు. ప్రధానంగా మెదక్‌ పట్టణంలోని ఆజంపురతోపాటు ర్యాలమడుగు.. ఆ తర్వాత పరిస్థితులకనుగుణంగా ఇతర చోట్ల మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసేలా వైద్య శాఖ అడుగులు వేస్తోంది.  మెదక్‌ పట్టణం, పాపన్నపేట మండలంలోని ఏడుపాయలలో ఉన్న హరిత హోటళ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు మెదక్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో 15 పడకలతో ఐసోలేషన్, 8 పడకలతో ఐసీయూ వార్డులు సిద్ధం చేశారు. 

ఆందోళనలో ప్రజలు
మెదక్‌లో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు జిల్లాలకు చెందిన ప్రజలు వివిధ పనులు, వ్యాపారాల నిమిత్తం మెదక్‌కు వస్తూ పోతుంటారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ నేపథ్యంలో ఇంటికే పరిమితమైనప్పటికీ.. పలువురు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరెవరు.. ఎవరిని కలిశారో.. ఎలాంటి ముప్పు వస్తుందనే భయం ప్రజల్లో నెలకొంది.

ఆ 12 మంది ఎక్కడ ?!
ఢిల్లీకి మతప్రార్థనలకు వెళ్లిన వారిలో జిల్లాకు చెందిన వారు మొత్తం 26 మంది ఉన్నట్లు సమాచారం. అయితే.. అధికారులు ఇప్పటివరకు 14 మందిని మాత్రమే గుర్తించారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. 13 మందికి నెగెటివ్, ఒకరికి పాజిటివ్‌ అని తేలింది. మిగిలిన 12 మంది ఎవరో.. ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటివరకు 14 మందిని మాత్రం గుర్తించామని.. ఇంకెందరు ఉన్నారో తమకు తెలియదని.. సర్వే కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.

వెళ్లాడు.. వచ్చాడు.. జనంలో తిరిగాడు! 
కరోనా వైరస్‌ బారిన పడిన మెదక్‌ పట్టణానికి చెందిన వ్యక్తి మత గురువు. అతడు మార్చి 13న ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ తబ్లిక్‌ జమాతే ఇస్లాం ఏ హింద్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు.  
21న ఢిల్లీ నుంచి కాచిగూడకు తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. అతడు ప్రయాణించిన బోగిలో మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురితోపాటు సంగారెడ్డి, జహీరాబాద్‌ ప్రాంతాలకు చెందిన పలువురు ఉన్నట్లు సమాచారం.
కాచిగూడలో దిగిన తర్వాత కరోనా బాధిత వ్యక్తితోపాటు మెదక్‌ జిల్లాకు చెందిన మరో ముగ్గురు నిజామాబాద్‌ వెళ్లే రైలు ఎక్కి చేగుంటలోని వడియారం రైల్వే స్టేషన్‌లో దిగారు. మిగిలిన వారు కాచిగూడ స్టేషన్‌ నుంచే వారి వారి ప్రాంతాలకు తరలివెళ్లారు.
కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి, మెదక్‌ జిల్లాకు చెందిన ముగ్గురు వడియారం నుంచి చేగుంటకు చేరుకున్నారు. అక్కడ ఫిజియోథెరపీగా పనిచేస్తున్న తమ స్నేహితుడిని కలిశారు. అతడి కారులో మెదక్‌కు వచ్చారు.
ఆ తర్వాత కరోనా బాధిత వ్యక్తి.. ఢిల్లీలో జరిగిన సమావేశ వివరాలను స్థానికంగా సమావేశం నిర్వహించి వివరించినట్లు తెలిసింది.
అనంతరం 23, 24న మాచవరం గేటు వద్ద గల తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో ర్యాలమడుగులోని తన బంధువులు, సన్నిహితుల వద్దకు వెళ్లి ఢిల్లీ ముచ్చట్లు పంచుకున్నట్లు సమాచారం.
25 నుంచి 29వ తేదీ వరకు తన ఇంట్లోనే ఉన్నాడు.  
29న వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా... మంగళవారం రాత్రి పాజిటివ్‌గా తేలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement