- సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు
- మేనిఫెస్టోలోని ప్రతీ అంశాన్ని అమలు చేస్తాం
- డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య
లింగాలఘణపురం : ప్రజలు కోరుకున్న విధంగా బంగారు తెలంగాణ, రాష్ట్ర పునర్నిర్మానం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.. మేనిఫెస్టోలోని ప్రతీ అంశాన్ని అమలు చేస్తాం.. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు మరిన్ని వనరులను పెంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అన్నారు.
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, పంచాయతీల నుంచే అభివృద్ధి మొదలు కావాలని, అందుకోసం ఇంటి పన్నులు, ఇతర పన్నుల చెల్లింపులు సకాలంలో చేయాలని సూచించారు. గురువారం ఎంపీపీ బోయిని శిరీషరాజు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన మన మండలం-మన ప్రణాళిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 3 కోట్ల 62 లక్షల జనాభా ఉంటే లెక్క ప్రకారం 84 లక్షల కుటుంబాలు ఉండాలి.. అయితే 91 లక్షల కుటుంబాలు ఉన్నాయని, రేషన్‌కార్డుల విషయంలోనూ ఇంటికో కార్డు చొప్పున 91 లక్షలకు గాను 15 లక్షల పింక్, 5 లక్షల అంత్యోదయ మొత్తం కలిసి 110 లక్షల కార్డులు ఉన్నాయని చెప్పారు.
ఇళ్ల మంజూరులో సైతం తేడాలున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్లు కేటాయించారని, అందులో రూ.50వేల కోట్లు ఎస్సీలకు, రూ.25వేల కోట్లు బీసీలకు, రూ.10వేల కోట్లు మైనారిటీలకు, రూ.15వేల కోట్లు గిరిజనులకు కేటాయించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలని కోరారు. స్థానిక పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది సక్రమంగా పని చేయాలని, నిర్లక్ష్యం చేస్తే ఏ శాఖ అధికారులైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండల అభివృద్ధికి చేసిన ప్రణాళికల పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని పనులు మంజూరయ్యేలా చూడాలని ఈ సందర్భంగా ఎంపీపీ శిరీషరాజు డిప్యూటీ సీఎంను కోరారు. వెనకబడిన మండలాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలని జెడ్పీటీసీ రంజిత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు సాధికారత సాధించినప్పుడే అభివృద్ధి చెందినట్లు అవుతుందని అన్నారు.
గ్రామాల్లో అవసరాలు, వనరులను అనుసంధానం చేయాలని చెప్పారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదని, విద్య, ఆరోగ్యం, మహిళాసాధికారత, తాగునీరు, పరిశుభ్రత, నిరుద్యోగ సమస్య పరిష్కారం తదితర పనులు జరగాలన్నారు. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పని చేయాలని కోరారు.
ప్రతి ఇంటి కి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, జిల్లాలో 2ల క్షల 50వేలు మంజూరయినట్లు వివరించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, ప్రత్యేక అధికారి గోపాల్, ఎంపీడీఓ వసంత, తహసీల్దార్ సరిత, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హౌసింగ్ డీఈలు కృష్ణమూర్తి, పోషయ్య, సూర్యారావు, ట్రాన్స్‌కో ఏఈ ఐలయ్య, ఏఓ షర్మిల, శంకర్‌నాయక్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం డిప్యూటీ సీఎం మొక్కలు నాటారు.