- అనారోగ్యమా...? పని ఒత్తిడి కారణమా!
చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పోలీస్ పికెట్ రూంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్రినాక పోలీసుల కథనం ప్రకారం... ఏపీఎస్పీ ఫస్ట్ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ కుమారుడు సీహెచ్ కిరణ్‌కుమార్ (30) ఛత్రినాక ఠాణాలో కానిస్టేబుల్ (పీసీ నెం. 9564)గా పని చేస్తున్నాడు. కిరణ్ కుటుంబ సభ్యులంతా యూసుఫ్‌గూడలోని పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉంటున్నారు.
2007 బ్యాచ్‌కు చెందిన కిరణ్ 2008 నుంచి ఛత్రినాక పీఎస్‌లో పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 10 గంటల నుంచి ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ రోడ్డులోని కట్టమైసమ్మ ఆలయం పక్కన ఉన్న ‘ఛత్రినాక పోలీస్ పికెట్ రూమ్’లో మరో కానిస్టేబుల్ వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, తన ఇంట్లో ఓ కార్యక్రమం ఉండటంతో శ్రీనివాస్‌గౌడ్ సెలవు మంజూరు చేయించుకొనేందుకు ఛత్రినాక ఠాణాకు వెళ్లాడు.
అతను అరగంట తర్వాత వచ్చి చూడగా, కిరణ్ పికెట్ రూం పైకప్పులోని రేకుల పైప్‌కు తాడుతో ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. విషయం తెలిసి దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, అదనపు డీసీపీ కె.బాబురావు, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిరణ్ ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో ఎలాంటి సూసైడ్‌నోట్ దొరకలేదు. కాగా డీఐ దేవేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇంకా వివాహం జరగలేదు.
మెడికల్ రిపోర్ట్స్ లభ్యం...
మృతుడు కిరణ్ బ్యాగ్‌లో మెడికల్ రిపోర్ట్స్ దొరికాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వాటిలో ఉంది. బ్యాగ్‌లో ఒక సిరఫ్ కూడా ఉంది. కిరణ్ సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలించారు. అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా...? ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా...? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా గురువారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరైన కిరణ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు డ్యూటీ దిగాల్సి ఉంది.
అయితే, శుక్రవారం ప్రార్థనల బందోబస్తు కోసం సాయంత్రం వరకు ఇక్కడే ఉండాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న విషయాలు తుది విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్, ఎస్సైల వేధింపులు ఎక్కువ కావడంతో విధి నిర్వహణ కొనసాగించలేని పరిస్థితి నెలకొందని ఛత్రినాక ఠాణాకు చెందిన కొందరు కానిస్టేబుళ్లు దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠీకి ఘటనా స్థలంలోనే మౌఖికంగా ఫిర్యాదు చేశారు.